రైతుభరోసా కింద ఈ సీజన్ పంటల పెట్టుబడి సాయం రూ.6 వేలను జనవరి 26న జమచేస్తున్నామంటూ కాంగ్రెస్ సర్కారు ఇటీవల ఊరించడంతో ఊళ్లలోని రైతులందరూ ఆశగా ఎదురుచూశారు. కానీ ‘ఇప్పుడు కేవలం ఎంపిక చేసిన గ్రామాల రైతులకే జమ చేస్తున్నాం.. మిగతా గ్రామాల రైతులందరికీ మార్చి 31లోపు జమ చేస్తాం’ అంటూ ఆ తరువాత ప్రభుత్వం మాట తప్పడంతో పైలట్‌కు వెలుపలి గ్రామాల అన్నదాతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయినప్పటికీ చాలామంది రైతులు కళ్లలో ఒత్తులేసుకొని మరీ ఎదురుచూస్తున్నారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకూ ప్రతి రోజూ తమ సెల్ఫోన్లలోకి చూస్తూ మెసేజీలను పరిశీలించుకుంటుకున్నారు. ఇప్పటికే మూడు సీజన్లవి పెండింగ్‌లో ఉండడం, తాజాగా ఈ నెల 27న పైలట్ గ్రామాల్లోని కొద్దిమంది రైతులకు పంటల సాయం జమకావడం వంటి పరిణామాల నేపథ్యంలో.. ప్రభుత్వం తొలుత చెప్పినట్లుగా తమకు పంటల సాయం జమ చేస్తుందేమోననుకుంటూ కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఏ రైతును గమనించినా క్షణానికోసారి సెల్ఫోన్లలో మెసేజీలు చెక్ చేసుకుంటున్న దృశ్యాలు, బ్యాంకుల వద్ద ఖాతాల్లో బ్యాలెన్స్ పరిశీలించుకుంటున్న దృశ్యాలే కన్పిస్తున్నాయి. రైతుభరోసా కోసం అన్నదాతలు ఎంతలా ఎదురుచూస్తున్నారో అనేందుకు ఇలాంటి దృశ్యాలే అన్ని గ్రామాల్లోనూ కన్పిస్తున్నాయి.
– భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 29 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జిల్లా రైతులకు ఎదురుచూపులు తప్ప మరేమీ మిగలగడం లేదు. కళ్లలో ఒత్తులేసుకొని మరీ వేచిచూసినా రైతుభరోసా మాత్రం రావడం లేదు. తొలుత వానకాలం పంటకు రాలేదు. తరువాతి యాసంగి సీజన్‌కూ రాలేదు. నిన్నామొన్న చెప్పిన గడువుల్లోనూ జమ కాలేదు. దీంతో పంటల పెట్టుబడి కోసం అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు. జనవరి 26న జమ చేస్తామంటూ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే అన్నదాతలందరూ ఎంతో ఆశ పడ్డారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం ఎప్పుడొస్తుందా అని ఎదురుచూశారు. ‘గణతంత్ర దినోత్సవాన బ్యాంకులకు సెలవు కావడంతో ఆ రోజు అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు (జనవరి 27) ఉదయం వరకూ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి’ అని ప్రకటించడంతో కాస్త నిట్టూర్చారు. కానీ జనవరి 27న ఎంపిక చేసిన గ్రామాల రైతులకేనని, మిగిలిన గ్రామాల రైతులకు మార్చి 31లోపు జమస్తామని ప్రభుత్వం మళ్లీ ప్రకటించడంతో ఒక్కసారిగా నీరసించిపోయారు. కానీ ఒకవేళ ప్రభుత్వం పంటల సాయాన్ని జమ చేస్తుందేమోనన్న అపోహతో రోజూ సెల్ఫోన్ల వైపే ఆశగా చూస్తున్నారు.
కేవలం 22 గ్రామాల రైతులకే..
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కేవలం 22 పైలట్ గ్రామాల రైతులకే రైతుభరోసా జమ కావడంతో మిగిలిన గ్రామాల రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకెందుకు జమ చేయడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో జనవరి 29న ‘నమస్తే తెలంగాణ’ చేసిన క్షేత్రపరిశీలనలో కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వం చెప్పిన గడువైన జనవరి 26, 27 తేదీలు ముగిసి రెండు మూడు రోజులు దాటినా చాలామంది రైతులు ఇప్పటికీ క్షణక్షణానికీ తమ సెల్ఫోన్ల మెసేజీలు చెక్ చేసుకుంటున్నారు. వీరిలో కొందరు రైతులను ‘నమస్తే’ పలుకరించగా.. ‘రెండు రోజులుగా ఎదురుచూస్తున్నా కనీసం మా మెసేజ్‌లు కూడా రాలేదు’ అంటూ వాపోతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తమ గ్రామంలో మొత్తం 550 మంది రైతులకు రైతుబంధు పంటల పెట్టుబడి సాయం అందేదని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకూ రైతుభరోసా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇటీవల తమ ఊరిలో ప్రభుత్వం గ్రామసభ పెట్టిందని, అర్హులైన రైతుల జాబితాను ప్రకటించిందని చెప్పారు. కానీ అలా ప్రకటించిన రైతుల్లో ఒక్కరికి కూడా, కనీసం ఎకరం సాగుభూమి ఉన్న వాళ్లకు కూడా రైతుభరోసాను జమ చేయలేదని విమర్శించారు. మరి పెట్టుబడి సాయం జమ చేయకుంటే గ్రామసభలు ఎందుకు పెట్టారని? జాబితాను ఎందుకు ప్రకటించారని రైతు కుటుంబాలు ప్రశ్నిస్తున్నాయి.
1,87,597 మందిలో 22,125 మందికే జమ..
భద్రాద్రి జిల్లాలో జరిగిన గ్రామసభల్లో అర్హులైన రైతులను గుర్తించారు. మొత్తంగా 1,87,597 మందికి రైతుభరోసా ఇస్తామని ప్రకటించారు. కానీ ఇందులో ఆఖరికి 22 పైలట్ గ్రామాలను ఎంపిక చేసి వాటిల్లో ఎంపిక చేసిన కేవలం 22,125 మంది రైతులకే మాత్రమే రైతుభరోసా నిధులు విడుదల చేశారు. కానీ వీరిలోనూ చాలామందికి పంటల సాయం జమ కాలేదు.
సమాధానం చెప్పలేక అధికారులు సతమతం..
అయితే, పైలట్ గ్రామాలు మినహా మిగతా రైతులకు రైతుభరోసా జమ కాకపోవడంతో ఆయా రైతులందరూ అధికారుల వద్దకు, రైతు వేదికల వద్దకు పరుగులు తీస్తున్నారు. తమకెందుకు రైతుభరోసా జమ కాలేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో, ‘తొలుత పైలట్ గ్రామాల రైతులకే ప్రభుత్వం జమ చేసింది. మిగిలిన గ్రామాల రైతులకు తరువాత జమ చేస్తుంది’ అంటూ సమాధానం చెబుతున్నారు. అయితే, ‘వాళ్లు మాత్రమే రైతులా? మేము రైతులం కాదా?’ అంటూ అన్నదాతలు నిలదీస్తుండడంతో సమాధానం చెప్పలేక అధికారులు సతమతమవుతున్నారు.
నాకు రైతుభరోసా రాలేదు..
నాకు ఎకరం పొలం ఉంది. కానీ ఇంత వరకూ రైతుభరోసా రాలేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికే ఒక పంటకు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టింది. రెండో పంటకు ఇస్తుందనుకుంటే అదీ ఇవ్వలేదు. జనవరి 26న ఇస్తామని మొన్న ప్రకటించారు. కానీ మాకు మాత్రం రాలేదు. మా ఊరిలో ఎవరికీ జమ కాలేదు. ఎకరం పొలం ఉన్న వాళ్లకు మొదటగానే వస్తుందన్నారు. కానీ రాలేదు. బ్యాంకుకు వెళ్లి చూశాను. రైతుభరోసా జమకాలేదని బ్యాంకోళ్లు చెప్పారు.
-బి.ఈర్యా, రైతు, తిప్పనపల్లి, చండ్రుగొండ
రెండు రోజులుగా ఫోన్ మెసేజీలు చూస్తూనే ఉన్నారు..
జనవరి 27న రైతుభరోసా జమ అయిందని, ఫోన్లన్నీ టింగ్ టింగ్ మని మోగాయని చెప్పారు. కానీ నా ఫోన్ మాత్రం మోగనే మోగలేదు. రెండు రోజులుగా ఫోన్‌ను పట్టుకొని చూస్తున్నా. అయినా నా ఫోన్‌కు రైతుభరోసా మెసేజ్ రాలేదు. నాకే కాదు.. మా ఊరిలో ఎవరికీ రాలేదు. కానీ జనవరి 26నే రైతుభరోసా వేస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ వేయలేదు. కేవలం గ్రామసభల్లో రైతుల పేర్లు మాత్రమే చదివారు.
– అంచం యూకయ్య, రైతు, తిప్పనపల్లి చండ్రుగొండ
ఏ పథకం కూడా రాలేదు..
మాది నిరుపేద కుటుంబం. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకంలోనూ నా పేరు రాలేదు. అంటే అన్నింటికి అనర్హురాలినని తేల్చినట్లున్నారు. కానీ గతంలో పథకాలు వచ్చినవారికే ఇప్పుడు మళ్లీ వచ్చాయి. ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, గృహజ్యోతి పథకాలు కూడా వర్తించలేదు. మాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు.
-సుబ్బలక్ష్మి, నందిగామ, మణుగూరు
పేదలకే ఇస్తామన్నారు.. మరి ఎందుకు ఇవ్వడం లేదు?
పథకాల్లో పేదలకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కానీ అసలైన పేదలకు పథకాలను ఇవ్వడం లేదు. డబ్బున్న వాళ్లకే పథకాలన్నీ ఇస్తోంది. అయితే అర్హుల జాబితాలో మా పేరు రాలేదంటే మేమంతా ఉన్నోళ్లమా? ఇదే విషయంపై అధికారులను ప్రశ్నిస్తే వారేమీ సమాధానం చెప్పడం లేదు. ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకుంటే లిస్టులో నా పేరు రాలేదు.
-కాపు లక్ష్మి, నందిగామ, మణుగూరు