మామిళ్లగూడెం, జూలై 10 : రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తరువాతే పూర్తిస్థాయి మార్గదర్శకాలు రూపొందించి ‘రైతుభరోసా’ పథకాన్ని అమలు చేస్తామని రైతుభరోసా పథకం రాష్ట్ర క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార పేర్కొన్నారు. ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు పంటల సాయం నిలుపుదల చేయాలని, రియల్ ఎస్టేట్ భూములు, సాగుకు పనికిరాని భూములకు కూడా పంటల పెట్టుబడి సాయాన్ని బంద్ పెట్టాలని రైతులు, ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
అయితే ఈ పథకం అమలులో రైతులు, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకే ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా విస్తృతస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. కాగా, ఇందులో భాగంగా సబ్ కమిటీ చైర్మన్ అయిన డిప్యూటీ సీఎం భట్టి, సభ్యులైన మంత్రులు తుమ్మల, పొంగులేటి కలిసి ఖమ్మం కలెక్టరేట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా విస్తృతస్థాయి సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. రైతులు, శాస్త్రవేత్తలు, డాక్టర్లు, లాయర్లు, జర్నలిస్టులు సహా వివిధ వర్గాల వారిని సమావేశ పరిచి రైతుభరోసా అమలుకు అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.
రైతులు, ప్రజల అభిప్రాయాల మేరకు విధివిధానాలు
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార మాట్లాడుతూ.. రైతులకు పంటల పెట్టుబడి సాయం కింద రైతుభరోసా ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చామన్నారు. ఆ హామీ అమలుకు తమ ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే నిధులను దృష్టిలో పెట్టుకొని త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతుందని తెలిపారు. అలాగే రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలోనే రైతుభరోసా అమలుపై విధివిధానాల రూపకల్పన చేస్తామన్నారు. ఇందుకోసమే తమ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ కమిటీని నియమించినట్లు చెప్పారు. ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి.. ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు రూపొందించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అర్హులకే రైతుభరోసా: తుమ్మల
క్యాబినెట్ సభ కమిటీ సభ్యుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిజమైన రైతులకే రైతుభరోసా అందించేందుకు అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. అన్ని వర్గాల ఆలోచనల మేరకు అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు రైతుభరోసా అందిస్తామన్నారు.
నిజమైన రైతులను ఆదుకుంటాం:పొంగులేటి
క్యాబినెట్ సబ్ కమిటీ మరో సభ్యుడు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నిజమైన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలిపారు. మరో తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు.
అభిప్రాయాలు తెలిపిన ఆయా వర్గాల ప్రజలు
అనంతరం, రైతుభరోసాపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని రైతులు, రైతు సంఘాల నాయకులు, కౌలు రైతులు, వైద్యులు, న్యాయవాదులు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలు, మరికొన్ని వర్గాల ప్రజలు తమ తమ అభిప్రాయాలను ఈ సమావేశంలో వ్యక్తం చేశారు. సాగుభూమికే భరోసా అందజేయాలని, చిన్న సన్నకారు రైతులకు న్యాయం చేయాలని, ఆదాయపు పన్ను చెల్లింపుదారులను తొలగించాలని, ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టాలేని రైతులకు పంటల సాయం అందించాలని, అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని, కౌలు రైతులకు బోనస్, పట్టా రైతులకు రైతుభరోసా అందించాలని, కౌలు రైతుల గురించి ఆలోచించాలని పేర్కొంటూ వారు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
సమాశంలో ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీలు రఘురాంరెడ్డి, బలరాంనాయక్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కే.రామకృష్ణారావు, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ముజమ్మిల్ ఖాన్, జితేశ్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, రాందాస్‌నాయక్, తెల్లం వెంకట్రావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యవసాయ అధికారులు విజయనిర్మల, బాబూరావు, అధికారులు, రైతులు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు.