మధిర/ మణుగూరుటౌన్, మే 31: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట నిరసనలు వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా మధిరలో డిపో కార్మికులు, సిబ్బంది ఎర్రబ్యాడ్జీలు ధరించారు.
మధిర డిపో జేఏసీ నాయకులు షేక్ నాగుల్‌మీరా, ఎం.రామచంద్రరావు, శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ జూన్ 2వ తేదీని అపాయింటెడ్ డే లీగల్ విలీన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసే ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిషరించాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు డిపోలో ఆర్టీసీ కార్మికులు ఎర్రబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నిరసన కార్యక్రమంలో పవన్‌కుమార్, మురళి, అశోక్, శ్రావణి, సందీప్, వెంకటేశ్వర్లు, పూర్ణ, రాంబాబు, కార్మికులు పాల్గొన్నారు.