తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. చడీచప్పుడు కాకుండా పేద, మధ్యతరగతి ప్రజలపై అదనపు భారం మోపింది. టోల్‌ప్లాజా ఉన్న రూట్లతోపాటు విద్యార్థుల నెలవారీ బస్సుపాస్లపై అదనపు చార్జీలను వసూలు చేస్తున్నది. ఖమ్మం రీజియన్ పరిధిలో గల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 8 డిపోలు ఖమ్మం, మధిర, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, సత్తుపల్లి, ఇల్లెందు, మణుగూరు ఉన్నాయి.
ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రతిరోజు వివిధ పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లి వచ్చే ప్రయాణికుల సంఖ్య వేలల్లోనే ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో వీరందరిపై అదనపు భారం పడింది. వీరితోపాటు ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, భద్రాచలం, పాల్వంచ తదితర పట్టణాలకు గ్రామీణ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో విద్యార్థులు చదువు నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. వీరందరిపై కూడా 20 శాతం చార్జీలను పెంచి అదనపు భారం మోపింది.
– ఖమ్మం, జూన్ 21
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 8 ఆర్టీసీ డిపోల పరిధిలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ తదితర అన్నిరకాల బస్సులు 560 వరకు ఉన్నాయి. ప్రతిరోజు ప్రయాణికుల కోసం కొన్ని వేల కిలోమీటర్లు ఆర్టీసీ సర్వీసులను నడుపుతున్నది. మొత్తం బస్సుల్లో 35 శాతం కేవలం హైదరాబాద్‌కు సర్వీసులు నడుస్తున్నాయి. ప్రతిరోజు ఖమ్మం రీజియన్ పరిధిలో 2 లక్షల 65 వేల మంది ప్రయాణికులు రాకపోకలు కొనసాగిస్తే.. దీనిలో హైదరాబాద్‌కు వెళ్లివచ్చే వారే 1 లక్షా 35 వేలకు పైగా ఉంటారు. వీరందరిపై ఒక్కో ప్రయాణికుడిపై రూ.30 చొప్పున అదనపు భారం మోపారు. ఖమ్మం నుంచి ఒక ప్రయాణికుడు హైదరాబాద్ వెళ్లి వస్తే రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. ఇది పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అదనపు భారం అవుతున్నది.
3 టోల్‌ప్లాజాలు.. రూ.30 అదనం
నేషనల్ అథారిటీ ఆఫ్ ఇండియా టోల్ రేట్లను పెంచడంతో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా టోల్‌ప్లాజా యూజర్ చార్జీలను పెంచింది. పెరిగిన రేట్లు ఈ నెల 9వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. టోల్‌ప్లాజాలు ఉన్న రూట్లలోనే కాకుండా అన్ని రూట్లలో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. టోల్‌ప్లాజాల మీదుగా వెళ్లే ప్రయాణికుల నుంచి అదనంగా పది రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు.
ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు 3 టోల్‌ప్లాజాలు ఉన్నవి. ఖమ్మం నుంచి సూర్యాపేటకు ఒకటి, సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు రెండు టోల్‌ప్లాజాలు ఉన్నవి. అంటే ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు వెళ్లే ప్రయాణికులకు ఒక్కో టికెట్‌కు అదనంగా రూ.30 చొప్పున వసూలు చేస్తున్నారు. సూర్యాపేట వరకు రూ.10 వసూలు చేస్తున్నారు. టోల్ లేని రూట్లలో కూడా రూ.10 చొప్పున అదనంగా వసూలు చేస్తుండడం గమనార్హం.
3 వేల మంది విద్యార్థులపై భారం
దళిత, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గుదిబండను మోపింది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఇంటర్ విద్య కోసం పట్టణాలకు వెళ్తుంటారు. ఆర్థికంగా వెనుకబడిన వారు, రెక్కాడితే డొక్కాడని పేద విద్యార్థులు ప్రతిరోజు పట్టణాలకు వెళ్లి చదువుకొని తిరిగి సాయంత్రానికి ఇంటికి వస్తారు. వీరందరూ ఆర్టీసీ కల్పించే రాయితీ బస్సుపాసులపైనే ఆధారపడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో సుమారు 3 వేల మందికి పైగా విద్యార్థులు ఆర్టీసీ బస్సుపాసులు కలిగి ఉన్నారు. అలాంటి వారిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 20 శాతం అదనపు చార్జీలను పెంచింది.
టోల్పేరుతో చార్జీల పెంపు సరికాదు..
పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి.. అదే పేదలు ప్రయాణం చేసే ఆర్టీసీ చార్జీలు పెంచడం సరైంది కాదు. టోల్‌చార్జీలు పెంచితే ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచాలి? హైదరాబాద్ వెళ్లి వస్తే రూ.60 అదనంగా చెల్లించాల్సి వస్తున్నది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలి.
– కళ్యాణ్, ఖమ్మం
చార్జీలు పెంచడం అన్యాయం
టోల్‌ప్లాజాలు ఉన్న రూట్లలో ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచడం అన్యాయం. ఎక్స్‌ప్రెస్ లాంటి బస్సుల్లో హైదరాబాద్ వెళ్లాలంటే సీట్లే ఉండవు.. ఐనా అదనంగా చార్జీ చెల్లించాల్సి వస్తున్నది. టోల్‌రేట్లు పెరిగితే ఆ భారం ప్రయాణికులపై వేయడం ఎంతవరకు సబబు.
– ననదవిహార్, ఖమ్మం
విద్యార్థులు ఏం పాపం చేశారు..
విద్యార్థుల బస్సుపాసుల రేట్లను పెంచిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి వారు ఏ పాపం చేశారు. పేదవర్గాలకు చెందినవారే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తారు. అలాంటి వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అదనపు భారం మోపడం తగదు. అది కూడా ఒకేసారి 20 శాతం పెంచడం చాలా దుర్మార్గం.
– టి.లక్ష్మణ్, పీడీఎస్‌యూ, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు