విజయ్ దేవరకొండ, రష్మిక మందన వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ఉదయ్‌పూర్ వేదికగా గురువారం అంగరంగ వైభవంగా జరిగిన కల్యాణంతో వెండితెర సూపర్‌హిట్ జోడీ.. మూడుముళ్ల బంధంలోకి ప్రవేశించింది. కొడవ, తెలుగు సంప్రదాయాలకు అనుగుణంగా వివాహం జరిగింది. ‘గీతగోవిందం’ చిత్రంతో వారిద్దరి ప్రణయ ప్రయాణం మొదలవగా, ‘డియర్ కామ్రేడ్’ సినిమాతో వారి ప్రేమ హాట్‌టాపిక్‌గా మారింది. ఏడేండ్ల దోబూచులాటకు తెరదించుతూ విజయ్, రష్మిక తమ బంధాన్ని ప్రపంచానికి పరిచయం చేసుకున్నారు. పెండ్లి ఫొటోలను పంచుకుంటూ ‘ప్రాణస్నేహితురాలినే నా భార్యగా చేసుకున్నా’ అని విజయ్ ట్వీట్ చేయగా.. ‘నా భర్త మిస్టర్ విజయ్ దేవరకొండ’ అని రష్మిక పోస్టు చేశారు.
‘గీత గోవిందం’ వారిద్దరి ప్రణయానికి శ్రీకారం చుట్టింది. అష్టపదుల సాక్షిగా చిగురించిన వలపు బంధం దినదిన ప్రవర్ధమానమై సప్తపదుల వైపు నడిపించింది. వెండితెర సూపర్‌హిట్ జోడీ నిజ జీవితంలో మూడుముళ్ల బంధంతో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అగ్ర తారలు విజయ్ దేవరకొండ-రష్మిక మందన్న (విరోష్) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గురువారం ఉదయం 10:10 గంటలకు రష్మిక మెడలో విజయ్ దేవరకొండ మూడుముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషుల సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమెంటోస్ రిసార్ట్స్ వేదికగా నిలిచింది.
రెండు కుటుంబాల సంస్కృతులు, సంప్రదాయాల కలయికగా పెళ్లి ఘట్టాలను నిర్వహించారు. తొలుత తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిపించారు. సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక కొడవ సంప్రదాయంలో పెళ్లి తంతుని నిర్వహించారు. వివాహానంతరం కొత్త జంటకు సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు.

వివాహానంతరం విజయ్-రష్మిక మందన్న సోషల్‌మీడియాలో పెళ్లి ఫొటోలను పంచుకున్నారు. ‘మీకు నా భర్తను పరిచయం చేస్తున్నా.. మిస్టర్ విజయ్ దేవరకొండ’ అంటూ రష్మిక మందన్న ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేసింది. ‘విజయ్..నాకు జీవితంలో నిజమైన ప్రేమను పరిచయం చేసిన వ్యక్తి. ప్రశాంతత ఎలా ఉంటుందో నాకు చూపించిన వ్యక్తి. నిర్మొహమాటంగా నేను వ్యక్తం చేసే భావాలకు ఎప్పుడూ అడ్డు చెప్పని వ్యక్తి.
పెద్ద కలలు కనాలని, నేను ఏదైనా సాధించగలనని నమ్మకం కలిగించిన వ్యక్తి. స్నేహితులతో కలిసి చేసే ప్రయాణాలు ఎంత గొప్పగా ఉంటాయో తెలియజేసిన వ్యక్తి. నేను ఈయన గురించి ఒక పుస్తకం రాయగలను. ఓ మహిళగా నా కలల్ని సాకారం చేసి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టావు. నేను నిజంగా అదృష్టవంతురాలిని విజ్జూ. ఇకపై ప్రతీది అందంగా, అర్థవంతంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు’ అంటూ రష్మిక మందన్న తన పోస్ట్‌లో పేర్కొన్నది.

వివాహానంతరం సోషల్‌మీడియా ఖాతాలో పెళ్లి ఫొటోలను షేర్ చేసిన విజయ్ దేవరకొండ తన ప్రేమకథను అభిమానులతో పంచుకున్నారు. తన బెస్ట్ఫ్రెండ్నే భార్యగా పొందానని చెప్పారు. ‘ఓ రోజు ఆమె మిస్ అయినప్పుడు తెలిసింది.. తను పక్కనే ఉంటే బాగుండేదని. ఆమె ఎదురుగా ఉంటే తినే భోజనానికి కూడా ఓ అర్థం ఉంటుందని తెలుసుకున్నా. జిమ్‌లో తను పక్కనుంటే వర్కవుట్స్ తాలూకు కష్టం కూడా సులభంగా అనిపించేది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా మనశ్శాంతిని ఇచ్చే ఇల్లు తనే అని నాకు అర్థమైంది’ అంటూ విజయ్ దేవరకొండ ఆనందం వ్యక్తం చేశారు.