‘వర్షపు నీటిని ఒడిసిపట్టాలి. వరద నీటిని కట్టడి చేయాలి. చుక్క నీటిని వృథాగా పోనీయకుండా చెక్‌డ్యామ్‌లతో చెక్ పెట్టాలి’ అనేది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం వాగులు, ఏరులు, నీటి నిల్వకు అనువైన ప్రదేశాల్లో చెక్‌డ్యామ్‌లు నిర్మించడంతోపాటు వర్షాకాలంలో ప్రజా రవాణా వ్యవస్థకు ఇబ్బందులు కలగకుండా హై లెవల్ బ్రిడ్జిలు నిర్మించేందుకు సర్కారు పూనుకుంది. జిల్లాలోని సత్తుపల్లి, పాలేరు నియోజకవర్గాలకు చెక్‌డ్యామ్‌లు, హై లెవల్ బ్రిడ్జిల నిర్మాణానికి వరదలా నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు సత్తుపల్లి, పాలేరు ఎమ్మెల్యేలు వేర్వేరు ప్రకటనల్లో గురువారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
– సత్తుపల్లి/కూసుమంచి/ఖమ్మం రూరల్, ఆగస్టు 10
సత్తుపల్లి/ కూసుమంచి/ ఖమ్మం రూరల్, ఆగస్టు 10: వాగులు, ఏర్లలో పారే నీళ్లను వృథాగా పోనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాటిపై అనువైన చోట చెక్‌డ్యాములు నిర్మించి ఆ నీటిని పంటల సాగు కోసం మళ్లించాలని నిర్ణయించింది. అందుకోసం ఏర్లు, వాగులపై చెక్‌డ్యాములు నిర్మించేందుకు సంకల్పించింది. అలాగే, అదే వాగులపై మార్గాలు ఉన్న చోట హైలెవెల్ బ్రిడ్జిలు కూడా నిర్మించాలని భావించింది. తద్వారా వర్షాలు కురిసి వాగులు పొంగిన సమయాల్లోనూ రాకపోకలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపడుతోంది. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా ఏర్లు, వాగులపై చెక్‌డ్యాములు, హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించేందుకు నిర్ణయించింది. ఇందుకోసం ఆయా నియోజకవర్గాలకు తాజాగా నిధులు కూడా మంజూరు చేసింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సత్తుపల్లి, పాలేరు ఎమ్మెల్యేలు వేర్వేరు ప్రకటనల్లో గురువారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సత్తుపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో హైలెవల్ బ్రిడ్జిలు, చెక్‌డ్యాంల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.58.90 కోట్ల నిధులను గురువారం మంజూరు చేసింది. తల్లాడ మండలం నూతనకల్ – గూడూరు మధ్య రూ.10 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి, లోకవరం – పెనుబల్లి మధ్య రూ.15 కోట్లతో రెండు హైలెవల్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. మిట్టపల్లి వద్ద కట్టలేరు వాగుపై రూ.3.37 కోట్లతో, అంజనాపురం – రేజర్ల మధ్య దేవిపాడు వాగుపై రూ.3.37 కోట్లతో, కలకొడిమ వద్ద పెద్దవాగుపై రూ.2.83 కోట్లతో, పినపాక వద్ద కట్టలేరు వాగుపై రూ.3.73 కోట్లతో, రంగంబంజర్ వద్ద జల్లవాగుపై రూ.1.66 కోట్లతో, కుర్నవల్లి వద్ద కట్టలేరు వాగుపై రూ.8.94 కోట్లతో, కుర్నవల్లి వద్ద పెద్దవాగుపై రూ.2.32 కోట్లతో హైలెవెల్ బ్రిడ్జిలు నిర్మించనున్నారు. కల్లూరు మండలం యజ్ఞనారాయణపురం పెద్దవాగుపై రూ.3.93 కోట్లతో, తాళ్లూరు వెంకటాపురం వద్ద పెద్దవాగుపై రూ.1.68 కోట్లతో, పేరువంచ వద్ద కాత్రవాని వాగుపై రూ.2.15 కోట్లతో చెక్‌డ్యాములు నిర్మించనున్నారు.
ఖమ్మం రూరల్ మండలం ఊటవాగు తండా సమీపంలో చెక్‌డ్యామ్ నిర్మాణానికి అనుమతితోపాటు నిర్మాణానికి రూ.6.75 కోట్ల నిధులను మంజూరు చేయడంతో స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గుండాలతండా సమీపంలో చెక్‌డ్యామ్ వాడుకలోకి రావడం, మరికొద్ది రోజుల్లోనే ఊటవాగు తండా చెక్‌డ్యాం అందుబాటులోకి రానుండడంతో ఇక్కడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిన సీఎం కేసీఆర్‌కు, నిధుల మంజూరుకు కృషి చేసిన పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డికి ఖమ్మం రూరల్ మండల బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు బెల్లం వేణుగోపాల్, యండపల్లి వరప్రసాద్, బెల్లం ఉమ, జర్పుల లక్ష్మణ్‌నాయక్, అక్కినపల్లి వెంకన్న తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆరు చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి రూ.32 కోట్లు మంజూరయ్యాయి. జాన్‌బాద్‌తండాకు రూ.6.38 కోట్లు, ఖమ్మం రూరల్ మండలం ఊటవాగు తండాకు రూ.6.75 కోట్లు, కూసుమంచి మండలం జక్కేపల్లికి రూ.5.79 కోట్లు, నేలకొండపల్లి మండలం చెన్నారానికి రూ.6.65 కోట్లు, పైనంపల్లికి రూ.4.33 కోట్లు, సదాశివపురానికి రూ.2.55 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో ఆయా గ్రామాల్లోని ఏర్లు, వాగులపై చెక్‌డ్యామ్‌లు నిర్మించనున్నారు.