కారేపల్లి (కామేపల్లి) ఆగస్టు 13 : కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో రౌడీ రాజకీయం రాజ్యమేలుతుందని ఇల్లెందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం తాళ్లగూడెంలో బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గత 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయం రౌడీయిజంగా మారిందన్నారు. హత్యా రాజకీయాలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు రౌడీ షీటర్లకు షెల్టర్లుగా మారినట్లు తెలిపారు.
పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉండకపోతే అనేక దారుణాలు జరిగే అవకాశాలు ఉంటాయన్నారు. తమ పార్టీ నాయకులు సామా మోహన్ రెడ్డి, నూకల ఉపేందర్‌పై హత్యాయత్నానికి పన్నాగం పన్నిన గడబోయిన హరీశ్‌తో పాటు అతడికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఆమె వెంట బీఆర్ఎస్ కామేపల్లి మండల నాయకులు అంతోటి అచ్చయ్య, మల్లెల శ్రీనివాసరావు, వడియాల కృష్ణారెడ్డి, తీర్దాల చిదంబరరావు, కాట్రాల రాంబాబు, గడ్డం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.