రోళ్లు పగిలేలా ఎండలు
ప్రారంభం రోజే ప్రతాపం చూపింది రోహిణి కార్తె. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 48 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రోళ్లు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటలకే ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏ ఒక్కరినీ బయటకు రానీయడం లేదు. చల్లదనం లేనిదే ఉండలేని పరిస్థితి. దీంతో చిరువ్యాపారులు, దినసరి కూలీలతోపాటు వివిధవర్గాల ప్రజలు భానుడి భగభగలకు తాళలేకపోతున్నారు.
- ఉమ్మడి జిల్లాలో 48 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రత
- భానుడి తాండవానికి తాళలేకపోతున్న ప్రజలు
- ఉదయం 8 గంటల నుంచే ఠారెత్తిస్తున్న ఎండలు
- మధ్యాహ్నం నిప్పుల కొలిమిలా ఎండ వేడిమి
- ఎక్కడ చూసినా నిర్మానుషంగా రహదారులు
- ప్రారంభం రోజే ప్రతాపం చూపిన రోహిణి కార్తె
ప్రారంభం రోజే ప్రతాపం చూపింది రోహిణి కార్తె. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 48 డిగ్రీల వరకూ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో రోళ్లు పగిలేలా ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం పది గంటలకే ఠారెత్తిస్తున్న ఎండలు.. ఏ ఒక్కరినీ బయటకు రానీయడం లేదు. చల్లదనం లేనిదే ఉండలేని పరిస్థితి. దీంతో చిరువ్యాపారులు, దినసరి కూలీలతోపాటు వివిధవర్గాల ప్రజలు భానుడి భగభగలకు తాళలేకపోతున్నారు. ఇక మధ్యాహ్నం 12 దాటితే ఎండ వేడిమి నిప్పుల కొలిమికి మించిపోతోంది.
వాహనాల మీద ప్రయాణించేవారి చర్మం.. కణకణ మండే నిప్పుల్లో కాలిపోతున్నట్లుగా అవుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకూ ఇదే స్థాయిలో ఎండ దంచి కొడుతోంది. సాయంత్రం ఏడు గంటల వరకూ వడగాడ్పులు వీస్తున్నాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు అనే తేడా లేకుండా మధ్యాహ్నం వేళల్లో ఎక్కడ చూసినా రహదారులన్నీ నిర్మానుషమవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండలు కొడుతుండడంతో వడదెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. యువకుల నుంచి, వృద్ధుల వరకూ ఎండను తాళలేకపోతున్నారు. వడదెబ్బ మృతుల్లో వృద్ధులేగాక యువకులు కూడా ఉండడం ఎండల తీవ్ర తకు తార్కణం .

భద్రాద్రి కొత్తగూడెం, మే 25 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉదయం ఎనిమిది గంటలకే ఉష్ణతాపం మొదలవుతోంది. 10 గంటలు దాటితే నిప్పుల కొలిమిలో ఉన్నట్లే అనిపిస్తోంది. గడిచిన పది రోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుంచి 48 డిగ్రీల వరకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉన్నాయి. కానీ, అధికారులు ఆ గణాంకాలను వెల్లడించడం లేదు. సింగరేణి కార్మికులూ వేడికి అల్లాడిపోతున్నారు. జిల్లాలోని చిరువ్యాపారులు వేడికి తట్టుకోలేకపోతున్నారు. తలలపై రుమాల్లు వేసుకొని గొడుగుల కిందనే తలదాచుకుంటున్నారు. జనం బయటకు రాకపోవడంతో ఒకవైపు వారి స్వయం ఉపాధి దెబ్బతింటోంది. ఎండ వేడిమిని తట్టుకోలేక మరోవైపు వారు నరకం చూస్తున్నారు. ప్రభుత్వ చలివేంద్రాలు పెద్దగా లేవు. స్వచ్ఛంద సంస్థల చలివేంద్రాలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. ప్రధాన వ్యాపార కూడళ్లలో అక్కడక్కడా కొద్దిమంది దాతలు మజ్జిగ, చల్లని నీరు పంపిణీ చేస్తున్నారు.
‘భద్రాద్రి’లో 20 మంది..
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరగడంతో వడదెబ్బ మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన 25 రోజుల్లో భద్రాద్రి జిల్లాలో 20 మంది వడదెబ్బ కారణంగా మృతిచెందారు. ఇటీవల జూలూరుపాడు మండలంలో టూవీలర్ ప్రయాణంలో ఉండగానే కాలిపోయింది. రుద్రంపూర్లో వేడికి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ఇక ఇంట్లో మిషనరీలు బూడిదైపోతున్నాయి. ఏసీ వేస్తేనే తప్ప ఇంట్లో ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఫ్యాన్ వేసినా వేడి గాలి వీయడంతో ఇంట్లో కూడా ఉండలేకపోతున్నారు.

పిట్టల్లా రాలిపోతున్నారు..ఉమ్మడి జిల్లాలో వడదెబ్బకు 13 మంది మృతి
నమస్తే నెట్వర్క్, మే 25: భానుడి భగభగలకు విలవిల్లాడుతూ ఉమ్మడి జిల్లా ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. వడదెబ్బకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఆదివారం గరిష్టంగా పదిమంది మరణించారు. అయితే, సోమవారం కూడా అదేస్థాయిలో 13 మరణాలు నమోదుకావడం ఆందోళనకరంగా ఉంది. వాంతులు, విరేచనాలతో కొందరు, తీవ్ర అస్వస్థతకు గురై మరికొందరు ప్రాణాలు విడిచారు. వీరిలో అత్యధికులు రోజువారీ కూలీలు, వృద్ధులు ఉండడం గమనార్హం. మృతుల్లో ఖమ్మం పాండురంగాపురానికి చెందిన కొప్పుల సీతారాములు (65), సత్తుపల్లి మండలం కిష్టారం అంబేదర్నగర్ కాలనీకి చెందిన పాలకుర్తి ఆదినారాయణ (ఆదాము) (68), ఖమ్మం రూరల్ మండలం దారేడు గ్రామానికి చెందిన షేక్ ఇమామ్ (46), కొత్తగూడెం రుద్రంపూర్ తిలక్నగర్కు చెందిన దేవులపల్లి లక్ష్మి (80), పాల్వంచ రాహుల్గాంధీనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ టీచర్ జలగం ప్రభావతి (60), పాల్వంచ గట్టాయిగూడెం ప్రాంతానికి చెందిన చందనబోయిన మల్లయ్య, ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ముత్తిని నరసింహారావు (70), కూసుమంచి మండలం బోడియాతండాకు చెందిన భూక్యా అచ్చమ్మ (70), దమ్మపేట మండలం చలనప్పగూడేనికి చెందిన బండారు నాగమణి (40), చర్ల మండలం కలివేరు గ్రామానికి చెందిన మజ్జురి పెంటమ్మ (70), బూర్గంపహాడ్ మండలం టేకులచెరువు గ్రామానికి చెందిన దాసరి దుర్గమ్మ(56), భద్రాచలానికి చెందిన అనసూర్య (46), ఖమ్మం రామన్నపేటకాలనీకి చెందిన గురిజాల కొండలు (56) ఉన్నారు. అయితే, వీరిలో రిటైర్డ్ టీచర్ ప్రభావతి భర్త భాస్కర్రావు కూడా ఈ నెల 11న వడదెబ్బ కారణంగానే మృతిచెందాడు. సరిగ్గా రెండు వారాలు తిరిగే సరికి భార్య ప్రభావతి కూడా అదే వడదెబ్బకు గురై ప్రాణాలు విడిచింది.
ఎండలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్
మామిళ్లగూడెం, మే 25: జిల్లాలో తీవ్ర ఎండలు, వడగాలులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం కలెక్టర్ దివాకర టీఎస్ సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నందున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, రోగులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎండ తీవ్రత వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం అధికంగా ఉండడంతో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. తరుచుగా నీళ్లు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలని సూచించారు.
పుచ్చకాయ, దోసకాయ వంటి నీటిశాతం అధికంగా ఉండే పండ్లనూ తినాలన్నారు. బయటకు వెళ్లే సమయంలో గొడుగు, టోపీ, తడి గుడ్డ వంటివి ఉపయోగించాలన్నారు. వదులుగా ఉన్న లేత రంగు దుస్తులు ధరించాలన్నారు. అధిక మోతాదులో భోజనం, మద్యం, కాఫీ, టీ వంటి డీహైడ్రేషన్కు కారణమయ్యే పానీయాలను నివారించాలన్నారు. చిన్న పిల్లలను, వృద్ధులను ఎండలో ఎక్కువ సేపు ఉంచొద్దని హెచ్చరించారు. వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితులను చల్లని ప్రదేశానికి తరలించి చల్లని నీటితో శరీరాన్ని తడపాలని తెలిపారు. ఓఆర్ఎస్ ద్రావణం ఇవ్వాలన్నారు. అవసరమైతే సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

