భదాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ ఖమ్మంరూరల్/ కొణిజర్ల/ కారేపల్లి/ వైరాటౌన్/ భద్రాచలం/ పాల్వంచరూరల్/ జూలూరుపాడు/ ఇల్లెందు/ ఇల్లెందురూరల్/ టేకులపల్లి, ఆగస్టు 16 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల రహదారులపై వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు స్తంభించాయి. పత్తి, మిరప, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. పంట పొలాల్లోకి నీరు చేరడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రోడ్లు గుంతలమయంగా మారాయి. ఖమ్మం నగరంలో నిన్నామొన్నటి వరకు ఎనిమిది అడుగులకే పరిమితమైన మున్నేరు శనివారం ఒక్కసారిగా పెరిగింది. సాయంత్రానికి 15 అడుగులకు చేరుకోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. డీసీపీ ప్రసాదరావు, ఖమ్మంరూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి, సీఐ ముష్కారాజ్తో కలిసి నాయుడుపేట సమీపంలో వరద ఉధృతిని పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి మున్సిపాలిటీ అధికారులతో కలిసి మున్నేరు లోతట్టు ప్రాంతాలను పరిశీలించి సమీపంలోని కాలనీవాసులను అప్రమత్తం చేశారు. మరో రెండు అడుగులు పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది.
కొణిజర్ల మండలం పల్లిపాడు నుంచి ఏన్కూరు వెళ్లే రహదారిలో తీగలబంజర వద్ద పగిడేరు వాగు, అంజనాపురం వద్ద నిమ్మవాగు పొంగి ప్రవహించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.
కారేపల్లి మండలం పేరుపల్లి సమీపంలో బుగ్గవాగు వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. లలితాపురం చెరువు అలుగు పొంగిపొర్లడంతో తొడిదగలగూడెం నుంచి ఇల్లెందు వైపునకు రాకపోకలు స్తంభించాయి. మాణిక్యారం నుంచి చీమలపాడులో కూడా రాకపోకలు నిలిచిపోయాయి. చీమలపాడు రైల్వేస్టేషన్, చింతలపాడు, గాదెపాడు రైల్వే అండర్ బ్రిడ్జిల్లో నీరు నిల్వడంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
వైరా రిజర్వాయర్ నీటిమట్టం పగిడేరు, పెద్దవాగు నుంచి వస్తున్న వరద ప్రవాహంతో 20.8 అడుగులకు చేరుకుంది. నది పొంగిపొర్లడంతో ముసలిమడుగు, లక్ష్మీపురం ముంపుప్రాంతాల గ్రామస్తులను పునరావాస కేంద్రాలకు తరలించారు. తహసీల్దార్ శ్రీనివాసరావు మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాల ప్రజలను వైరాలోని కల్యాణ మండపానికి చేర్చి ఆహార సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం 28 అడుగులకు చేరింది. నదిలో స్నానాలు ఆచరించే భక్తులు నది లోపలికి వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. నది వద్ద లాంచీలు, పడవలు, గజఈతగాళ్లను అందుబాటులో ఉంచారు.
పాల్వంచ మండలంలోని కిన్నెరసాని ప్రాజెక్టులో భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుకు చెందిన రెండు గేట్లు ఎత్తి 10వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఒకేసారి పెద్దఎత్తున 14వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం 405 అడుగులకు తగ్గటం లేదు. దీంతో అధికారులు అప్రమత్తమై వెంటనే మరో గేటు ఎత్తి శనివారం 10వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుతం 405.50 అడుగులుగా ఉంది. పాల్వంచ, బూర్గంపాడు మండలాల్లోని కిన్నెరసాని పరీవాహక ప్రాంత ప్రజలు వాగు దాటొద్దని, మోటార్లు జాగ్రత్త చేసుకోవాలని ముందస్తు హెచ్చరికలు చేశారు.
జూలూరుపాడు మండలం రాంపురంతండా, వినోభానగర్, గుండెపుడి గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. అన్నారుపాడు-గుండ్లరేవు గ్రామాల మధ్య ఉన్న అలుగువాగు, పడమటనర్సాపురం-బేతాళపాడు గ్రామాల మధ్య ఉన్న తుమ్మల వాగు, అనంతారం-కాకర్ల మధ్య ఉన్న ఎర్రవాగు లోలెవల్ చాప్టాల మీదుగా వరద ప్రవహిస్తుండటంతో అధికారులు ట్రాక్టర్లు, మొద్దులను అడ్డుపెట్టి వాహన రాకపోకలు నిలిపివేశారు. ఎస్సై బాదావత్ రవి, ఎంపీడీవో రవి, పంచాయతీ సిబ్బంది పొంగుతున్న వాగులను పరిశీలించారు.
ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ఇల్లెందు 1వ వార్డు, సత్యనారాయణపురం మధ్య బుగ్గవాగుకు భారీగా వరద రావడంతో రెండుగంటలపాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. మండల పరిధిలోని నాయకులగూడెం, జెండాలవాగు, లలితాపురం వద్ద వరద ఉధృతంగా ప్రవహించి రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.
టేకులపల్లి మండలంలోని తూర్పుగూడెం నుంచి సేష్టన్ బేతంపూడి, తావుర్యాతండా, రాంపురాం గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ముర్రెడు, రాళ్ళవాగు, తెల్లవాగు చెరువు పొంగి ప్రవహిస్తున్నాయి.
భారీ వర్షాల నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెడ్ అలర్ట్‌లో ఉందని, అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు సాయంత్రంపూట వాగులు, పొలాల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. సహాయం కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలని సూచించారు. కలెక్టరేట్లో 08744-241950, వాట్సప్ నంబర్ 9392919743, భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో 08743-232444, వాట్సప్ నంబర్ 9347 910737, ఐటీడీఏ భద్రాచలంలో 7995268352 నంబర్లలో సంప్రదించాలని కోరారు.