SC Reservations | కారేపల్లి, మార్చి 16 : ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని, విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలలో సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కారేపల్లిలోని సినిమా హాల్ సెంటర్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో ఏడో రోజుకు చేరుకున్నాయి. ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు ఆదేర్ల రాములు దీక్ష శిబిరం వద్దకు చేరుకొని దీక్షలు చేపట్టిన వారికి మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగం ద్వారా వచ్చే రిజర్వేషన్ల ఫలాలు జనాభా ధమాషా ప్రకారం దక్కకపోవడంతో, రిజర్వేషన్ల ఫలాలు ఎస్సీ కులాలన్నిటికీ అందేలా న్యాయం జరగాలన్నారు. అన్ని రంగాలలో సమాన వాటా దక్కాలని అందుకోసం ఎస్సీలలో ఏబిసిడిలుగా వర్గీకరణ జరగాలని గత 30 సంవత్సరాల నుంచి న్యాయం కోసం ఉద్యమిస్తున్నాయన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1999లో వర్గీకరణ అమలుకు గత ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం మూలంగా 2000 నుండి 2004 వరకు వర్గీకరణ అమలు చేయడం జరిగిందని అన్నారు.
ఎస్సీ వర్గీకరణ అమలైన నాలుగు సంవత్సరాల్లో 23 వేల ఉద్యోగాలు మాదిగ, మాదిగ ఉపకులాలకు దక్కాయన్నారు. 2024లో సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పిన వెంటనే ఉమ్మడి రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేసి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలుకోకి తీసుకురావాలని ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదిర్ల శంకర్, అదాల వీరయ్య, ఎలగాడి ఉపేందర్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.