బూర్గంపహాడ్, ఏప్రిల్ 6: సామాన్యుడి ఇంటికి సీఎం రేవంత్రెడ్డి వచ్చి భోజనం చేసిన అంశం స్థానికంగా విమర్శలకు దారితీస్తోంది. ప్రచార ఆర్భాటం కోసమేనంటూ కొందరు, హామీలపై ప్రజల దృష్టిని మళ్లించేందుకేనంటూ మరికొందరు వ్యాఖ్యానాలు చేస్తున్నారు. పేదలకు తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తోందని, తాను కూడా నిరుపేద గిరిజనుడి ఇంట్లో అదే సన్నబియ్యంతో వండిన భోజనాన్ని తిన్నానని చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి ఇలాంటి ప్రచారాలు చేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
సన్నబియ్యం అందుకుంటున్న గిరిజన లబ్ధిదారుడి ఇంట్లో సీఎం భోజనం చేస్తారంటూ ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ చివరికి సీఎంకు భోజనం వడ్డించింది కాంగ్రెస్ యువ నేత కుటుంబమేనని స్పష్టం చేస్తున్నారు. అయితే, సామాన్యుడి ఇంట్లో సీఎం భోజనం చేసేందుకు వస్తే తమనెందుకు అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేస్తారంటూ బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 15 నెలలుగా అమలుచేయని పథకాలపై తాము ప్రశ్నిస్తామన్న భయంతోనే తమను అరెస్టు చేయించారంటూ మండిపడుతున్నారు. హామీల అమలులో తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రకటించిన పథకాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే సీఎం సామాన్యుల ఇళ్ల బాట పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తుండడం గమనార్హం.