అశ్వారావుపేట, జూన్ 27 : పాడి అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలు పది నెలలుగా వేతనాలు అందక గోస పడుతున్నారు. ప్రభుత్వం సకాలంలో జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ సైతం భారమై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలతోపాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా కనీస స్పందన లేకపోవడంతో మనోవేదనకు గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇచ్చే నామమాత్రపు వేతనంలో లక్ష్యం చేరకుంటే కోత విధించడం వారిని శ్రమదోపిడీకి గురిచేస్తున్నది. గత 25 ఏళ్లుగా ప్రభుత్వ సిబ్బందితో సమానంగా రైతులకు సేవలందిస్తున్నా ప్రభుత్వం నుంచి తగిన గౌరవం కూడా దక్కడం లేదు.
పాడి రైతులకు మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో 2000 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం గోపాలమిత్రలను నియమించింది. వీరు గ్రామాల్లో పశు వైద్యులకు సహాయకులుగా పని చేస్తున్నారు. ముఖ్యంగా మేలు జాతి దూడలను పెంపొందించడంలో ఎదకు వచ్చిన పశువులకు ప్రభుత్వం అందించే సెమన్ ఇస్తారు. దీంతోపాటు పశువులు, జీవాలకు వ్యాక్సినేషన్ నమోదు చేయడంలోనూ ప్రధాన భూమిక పోషిస్తున్నారు. పశువులు, గొర్రెలు, మేకలకు కూడా ప్రాథమిక వైద్యం అందించడంలో కీలకంగా మారారు. పశు సంపద అభివృద్ధిలో ప్రభుత్వ సిబ్బందికి పోటీగా పనిచేస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం సకాలంలో వేతనాలు మంజూరు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పనిచేస్తున్న గోపాలమిత్రలు ప్రతి నెలా ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాన్ని పూర్తి చేయాలి. లేకుంటే వేతనంలో కోత తప్పదు. నామమాత్రపు వేతనంతో పనిచేస్తున్న గోపాలమిత్రలు నెలవారీగా జీతాలు అందక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు నెలవారీ లక్ష్యం పూర్తి చేయకుంటే వేతనంలో కోత పెట్టడంతో శ్రమ దోపిడీకి గురవుతున్నారు. నెలలో ఒక్కో గోపాలమిత్ర సుమారు 100 పశువులకు కృత్రిమ గర్భధారణ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను పాడి రైతు నుంచి గోపాలమిత్రలు రూ.40 చొప్పున వసూలు చేసి ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలి. ప్రతి నెలా గోపాలమిత్రలకు ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయాల్సిందే. ఏదైనా ఒక నెలలో ఈ టార్గెట్ పూర్తికాకుంటే రూ.40 చొప్పున వేతనంలో కోత పెడుతున్నది.
పశు సంపద అభివృద్ధి కోసం 2000వ సంవత్సరంలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ డిస్ట్రిక్ట్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ(డీఎల్డీఏ) ద్వారా ప్రభుత్వం గోపాలమిత్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడం వీరు అందించే ప్రధానమైన సేవ. కానీ.. పాడి రైతులకు అందుబాటులో ఉంటూ పశువులకు ప్రథమ చికిత్స, నట్టల నివారణ మందు, వ్యాక్సినేషన్, బీమా చేయడం వంటి ఇతర సేవలు కూడా అందిస్తున్నారు. అయినా నెలవారీ వేతనాలు అందుకోలేకపోతున్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవేళ నెలవారీ టార్గెట్ పూర్తికాకుంటే ప్రస్తుతం ఇస్తున్న వేతనం రూ.11,050లో కోత పెడితే మరింతగా నష్టపోతున్నామంటూ మదనపడుతున్నారు. కనీస వేతనం రూ.24 వేలకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 260 మందికి గాను.. ప్రస్తుతం 258 మంది గోపాలమిత్రలు పని చేస్తున్నారు. రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీరికి రాష్ట్ర ప్రభుత్వం నెలకు రూ.11,050 చొప్పున గౌరవ వేతనం అందిస్తున్నది. గడిచిన 9 నెలలుగా వేతనం అందడం లేదు. ఈ నెలతో వేతనాలు అందక 10 నెలలు కావడంతో గోపాలమిత్రలకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కనీసం కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పారితోషికం కూడా మంజూరు కావడం లేదు. దీంతో గోపాలమిత్రలకు కుటుంబ పోషణ భారమై సతమతమవుతున్నారు. లక్ష్యాలతో సంబంధం లేకుండా ఉద్యోగ భద్రత కల్పించాలని గోపాలమిత్రలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
సుమారు 25 ఏళ్లుగా పశు సంవర్థక శాఖలో పనిచేస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలి. సర్వీసును పరిగణనలోకి తీసుకుని గోపాలమిత్రలను క్రమబద్ధీకరించాలి. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. నిత్యం అందుబాటులో ఉంటూ పాడి రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తూ భరోసా కల్పిస్తున్నాం. గోపాలమిత్రల సేవలను ప్రభుత్వం గుర్తించి ఇతర సమస్యలను పరిష్కరించాలి.
– మారబోయిన రవీందర్, రాష్ట్ర అధ్యక్షుడు, గోపాలమిత్ర సంఘం, ములుగు జిల్లా
ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనం సకాలంలో అందడం లేదు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ప్రతినెలా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇచ్చే టార్గెట్ పూర్తి చేయకుంటే వేతనంలో కోత పెడుతున్నది. చాలీచాలని వేతనాలతో ఏళ్లతరబడి పని చేస్తున్నాం. టార్గెట్ లేకుండా ప్రభుత్వం కనీస వేతనం రూ.24 వేలు అందించాలి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నాం.
– ఎం.రాము, గోపాలమిత్ర, అశ్వారావుపేట