భద్రాద్రి జిల్లాలో రిజిస్ట్రేషన్ల రాబడి రూ.57 కోట్లు
క్రమబద్ధీకరణ పట్టాల రిజిస్ట్రేషన్లతో పెరిగిన ఆదాయం
నాలుగు డివిజన్ల పరిధిలో 9,473 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్
అత్యధికంగా కొత్తగూడెం పరిధిలో 8,087..
అత్యల్పంగా బూర్గంపాడులో 126..
ఆదాయవనరులు పెరగడంతో భూములు, ఇండ్లు కొనేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సందడి కనిపిస్తున్నది. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడులోని నాలుగు సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో నిరుటి కంటే ఈ ఏడాది డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అదేస్థాయిలో ఆదాయమూ సమకూరింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.57.50 కోట్ల ఆదాయం వచ్చింది.
జిల్లాలో ఎక్కువ మండలాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండడంతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ కలిగిన భూములున్న కొత్తగూడెం, సుజాతనగర్, పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోనే క్రయవిక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంది. మిగిలిన సబ్ రిజిస్ట్రేషన్ల పరిధిలో వారసత్వంగా వచ్చిన భూములు, వివాహాల రిజిస్ట్రేషన్లు, మ్యూటే షన్ (పేరు మార్పు), అవసరాల నిమిత్తం తనఖా రిజిస్ట్రేషన్, ఇతరత్రా కార్యకలాపాలు మాత్రమే జరగడంతో వాటి పరిధిలో తక్కువ ఆదాయం వచ్చింది.
కొత్తగూడెం అర్బన్, ఏప్రిల్ 16: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలోని సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాలకు రాబడి పెరిగింది. జిల్లా పరిధిలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, బూర్గంపాడులలో ఉన్న నాలుగు సబ్ రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో నిరుటి కంటే ఈ ఏడాది డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయి. అదే రీతిలో ఆదాయమూ పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.57.50 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల ద్వారా ఖజానాకు సమకూరింది. జిల్లాలో ఎక్కువ మండలాలు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండడంతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు అవకాశం లేదు. రిజిస్ట్రేషన్ కలిగిన భూములు ఉన్న కొత్తగూడెం, సుజాతనగర్, పాల్వంచ, దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లోనే క్రయవిక్రయాలు జరిపి రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం ఉంది. మిగిలిన సబ్ రిజిస్ట్రేషన్ల పరిధిలో వారసత్వంగా వచ్చిన భూములు, వివాహాల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ (పేరుమార్పు), అవసరాల నిమిత్తం తనఖా రిజిస్ట్రేషన్, ఇతరత్రా కార్యకలాపాలు మాత్రమే జరగడంతో ఆయా పరిధిలో తక్కువగా ఆదాయం జమ అయింది.
రూ.57.50 కోట్ల ఆదాయం..
గత ఏప్రిల్ నెల నుంచి ప్రస్తుత మార్చి ఆర్థిక సంవత్సరం వరకు రిజిస్ట్రేషన్ల పరిశీలిస్తే కొత్తగూడెం డివిజన్ పరిధిలో 8,087 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.47.23 కోట్లు వచ్చాయి. కొత్తగూడెం, పాల్వంచ, సుజాతనగర్ మండలాలు జిల్లా కేంద్రానికి దగ్గరగా ఉండడం, రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేయడంతో క్రయవిక్రయాలు ఊపందుకున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వం ఇటీవల ఇంటి క్రమబద్ధీకరణ పట్టాలు పంపిణీ చేయడంతో కొంత ఆదాయం పెరిగింది. సాధారణ చార్జీలతోనే రిజిస్ట్రేషన్ చేస్తున్నప్పటికీ.. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వెంటనే తమ అవసరాల నిమిత్తం క్రయవిక్రయాలు జరగడంతో రిజిస్ట్రేషన్ల శాఖకు అదనపు ఆదాయం సమకూరింది. కొత్తగూడెం తర్వాత ఇల్లెందు పరిధిలో 1,329 డాక్యుమెంట్ల ద్వారా రూ.8.59 కోట్లు ఖజానాకు చేరింది. భద్రాచలంలో 431 డాక్యుమెంట్ల ద్వారా రూ.1.26 కోట్లు, బూర్గంపాడులో 126 డాక్యుమెంట్ల ద్వారా రూ.4.32 లక్షలు అత్యల్పంగా వచ్చాయి. గత ఏడాది రూ.15 కోట్లు సాధించగా.. ఈ ఏడాది మాత్రం అత్యధికంగా రూ.57.50 కోట్లు ఆర్జించింది.
ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేశాం..
రిజిస్ట్రేషన్ శాఖలో ఆన్లైన్ చలానా విధానం ప్రవేశపెట్టడం వల్ల భూములు, ఇల్లు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకునేవారికి సులభమవుతోంది. గతేడాదిలో అత్యధిక డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగింది. ఇంటి క్రమబద్ధీకరణ పట్టాల పంపిణీతో రిజిస్ట్రేషన్ల సంఖ్య పెరిగింది. గంటల తరబడి కార్యాలయంలో వేచి చూడాల్సిన అవసరం లేకుండానే తక్కువ సమయంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలల్లో పారదర్శకంగా కార్యకలాపాలు జరుగుతున్నాయి. భూముల కొనుగోలు, విక్రయాల విషయాల్లో, రిజిస్ట్రేషన్ వ్యవహరాల్లో ఏమైనా సమస్యలు, లోపాలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
– రామ్‌కుమార్, సబ్ రిజిస్ట్రార్, కొత్తగూడెం