అశ్వాపురం, జనవరి 24: ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకున్నదని, ఏడాది కాలంలో చేసిందేమీ లేదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ధ్వజమెత్తారు. మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకుడు కందుల కృష్ణార్జునరావు నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజా పాలన పేరిట స్వీకరించిన దరఖాస్తులు ఏమయ్యాయి? కులగణన సర్వే పేరిట స్వీకరించిన డేటా ఏమైంది? అని ప్రశ్నించారు. రైతు భరోసా పేరిట రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ అనేక మంది రైతులకు రుణమాఫీ చేయకుండా గోస పెడుతుందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే బాహాటంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులకే పథకాలు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నప్పుడు దరఖాస్తుల స్వీకరణ ఎందుకని ఆయన ప్రశ్నించారు.
బీఆర్ఎస్ నాయకులు కోడి అమరేందర్, ఈదర సత్యనారాయణ, జాలే రామకృష్ణారెడ్డి, కందుల కృష్ణార్జునరావు, సూదిరెడ్డి గోపిరెడ్డి, వెన్న అశోక్‌కుమార్, తోకల లత, కందుల దుర్గాభవాని, తాటి పూజిత, చిలక వెంకటరామయ్య, నక్కనబోయిన పాపారావు, మేడవరపు సుధీర్, తోకల దుర్గాప్రసాద్, బొల్లినేని గణేశ్, గొర్రెముచ్చు వెంకటరమణ, గద్దల రామకృష్ణ, లోహిత్, డాక్టర్ బాబు, నజీర్ సోను పాల్గొన్నారు.