అశ్వాపురం, జనవరి 27: సంక్షేమ పథకాలు అర్హులందరికీ అమలు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ప్రజా ఉద్యమాలు చేడపతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన గ్రామసభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ కేవలం ప్రజలను మభ్యపెట్టడానికే కానీ ప్రజలకు మేలు చేసేందుకు కాదని విమర్శించారు.
పేదలందరికీ ఇండ్లు మంజూరు చేయకుండా దరఖాస్తుదారుల పేర్లు చదివి అధికారులు చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. అర్హులను గుర్తించలేని గ్రామసభలు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలన మొత్తం దరఖాస్తుల స్వీకరించడానికే సరిపోయిందని, టైంపాస్ పాలన చేస్తూ ప్రజలను గోస పెడుతోందని ప్రభుత్వాన్ని దయ్యబట్టారు. దరఖాస్తుదారుల ఇంటికెళ్లి ఫొటోలు తీసిన అధికారులు అర్హులను గుర్తించడంలో విఫలమాయ్యరని అన్నారు.
రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల జిమ్మిక్కుల కోసమే ప్రభుత్వం హడావిడిగా గ్రామసభలు నిర్వహిస్తోంది తప్ప ప్రజలకు లబ్ధి కోసం కాదని ఆరోపించారు. ప్రజలు పెట్టిన ప్రతి దరఖాస్తుకు ప్రభుత్వం జవాబుదారీగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల నాయకులు కొల్లు మల్లారెడ్డి, కంచు గట్ట వీరభద్రం, కందుల కృష్ణార్జున్, మర్రి మల్లారెడ్డి, ఈదర సత్యనారాయణ, వెన్న అశోక్‌కుమార్, సూదిరెడ్డి గోపిరెడ్డి, చిలక వెంకటరామయ్య, గద్దల రామకృష్ణ, తోకల లత, నక్కబోయిన పాపారావు పాల్గొన్నారు.