సారపాక, జూలై 30: కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఈ ఎనిమిది నెలల కాలంలో జిల్లాలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారిందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు విమర్శించారు. ప్రజాపాలన పేరుతో గ్రామాల పాలన గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. జిల్లాలో పారిశుధ్యం పడకేయడం, జ్వరాలు విజృంభిస్తుండడం వంటి కారణాల నేపథ్యంలో మంగళవారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. పల్లెలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోయిందని, వర్షాకాలం సీజన్లో ప్రభుత్వం కనీసంగానైనా బ్లీచింగ్ చల్లించడం లేదని విమర్శించారు.
కలుషిత నీటిని తాగడం వల్ల ప్రజలు డయేరియా సహా ఇతర వ్యాధుల భారిన పడుతున్నారని అన్నారు. సీజనల్ వ్యాధులు, విష జ్వరాలు ప్రబలుతున్నాయని అన్నారు. కాగా, ఆయా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఆగస్టు 1న జిల్లాలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల్లో ధర్నాలు నిర్వహించాలని, అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని బీఆర్ఎస్ శ్రేణులకు రేగా పిలుపునిచ్చారు. గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించాలని, బురదతో కలుషితమైన ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లించాలని, వీధులను శుభ్రం చేయించాలని, వీధి దీపాలను అమర్చాలని, పల్లెల పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా మండల, పట్టణ, గ్రామ కమిటీలు వేయనున్నట్లు చెప్పారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 30 : విద్యార్థులు చెప్పే బోధనాంశంలోని అభ్యసన ఫలితాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు గుర్తించగలగాలని డీఈవో సోమశేఖర శర్మ అన్నారు. మంగళవారం నగరంలోని డైట్ కళాశాలలో న్యాస్(నేషనల్ అచీవ్మెంట్ సర్వే) శిక్షణ కార్యక్రమంలో డీఈవో పాల్గొని ప్రసంగించారు. తరగతి గదిలో అభ్యసన ఫలితాలు పిల్లలకు వస్తున్నాయో.. లేదో తెలుసుకొని ఎప్పటికప్పుడు మదింపు ప్రక్రియ జరగాలని సూచించారు. ఆగస్టు మొదటి వారంలో ఉన్నత పాఠశాలల స్థాయిలో 10 స్కూల్ కాంప్లెక్స్‌లను ఏర్పాటు చేసి మండల స్థ్ధాయిలో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
మంగళవారం ప్రైమరీ తెలుగు 42, ఇంగ్లిష్ 42 మంది, హైస్కూల్ నుంచి తెలుగు, ఇంగ్లిష్, గణితం, సబ్జెక్ట్‌లలో 20 మంది చొప్పున, జిల్లా రిసోర్స్ పర్సన్లు 11 మంది హాజరయ్యారు. బుధవారం మిగిలిన సబ్జెక్ట్‌లకు శిక్షణ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో కోర్సు డైరెక్టర్, డైట్ ప్రిన్సిపాల్ సామినేని సత్యనారాయణ, కోర్సు కోఆర్డినేటర్, ఏఎంవో కేశవపట్నం రవికుమార్, రాష్ట్ర రిసోర్స్ పర్సన్ ప్రభాకర్‌రెడ్డి, వైజీకే మూర్తి, హరికిరణ్, 140 మంది మండల రిసోర్స్ పర్సన్లు పాల్గ్గొన్నారు.