మణుగూరు టౌన్, నవంబర్ 3 : డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు (డీఎంఎఫ్టీ) నిధుల లెక్క అడిగినందుకు కాంగ్రెసోళ్లు భయపడ్డారని, అందుకే భౌతికదాడులకు పాల్పడుతున్నారని, అయినా నిధుల జాడ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయం (తెలంగాణ భవన్)పై కాంగ్రెస్ మూకలు దాడి చేయడాన్ని ఖండిస్తూ సోమవారం మణుగూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో వందలాది కోట్ల డీఎంఎఫ్టీ నిధులతో భద్రాద్రి జిల్లాను అభివృద్ధి చేశారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం సుమారు రూ.200 కోట్లను ఈ నియోజకవర్గం నుంచి రద్దు చేసి అది ప్రభుత్వ పాలసీ అని చెప్పడం ఏంటని నిలదీశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే భౌతికదాడులకు పాల్పడుతున్నారని అన్నారు. మణుగూరు బీఆర్ఎస్ కార్యాలయం స్థలాన్ని పట్టాదారు దగ్గర నుంచి తాను కొనుగోలు చేశానని అన్నారు. చట్టపరంగానే తమ కార్యాలయాన్ని పోరాడి తెచ్చుకుంటామన్నారు.
మంత్రులు, నాయకులకు చిత్తశుద్ధి ఉంటే వందల కోట్ల డీఎంఎఫ్టీ నిధులు ఎటుపోతున్నాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం ఎంత ఆదర్శంగా ఉందో, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో అంత దిగజారిపోయిందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంటా లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.