కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 21: ‘పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాలను దోపిడీ చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోదా? ఈ ప్రభుత్వానికి బాధ్యత లేదా?’ అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా బోర్డులో మనకు రావాల్సిన వాటా గురించి పట్టించుకోకుండా ఆంధ్రా సీఎం చంద్రబాబుకు ఊడిగం చేస్తున్నారని, దీనిపై బీజేపీ నాయకులు కూడా నోరు మెదపకుండా ప్రజలు, రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబును, కేంద్రాన్ని అడిగే దమ్ము సీఎం రేవంత్‌రెడ్డికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు.
ఓట్లు, సీట్లు, అధికారం కోసం మాత్రమే బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని, అధికారాన్ని అనుభవించేందుకు, పదవులు పంచుకునేందుకు ఆయా పార్టీల నాయకులు అర్రులు చాస్తున్నారని అన్నారు. కృష్ణా జలాలపై వెంటనే త్రీమెన్ కమిటీ వేయాలని, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేస్తే రైతుల పక్షాన తాము కూడా పాల్గొంటామన్నారు. తెలంగాణ రాష్ర్టానికి, ఈ ప్రాంత ప్రజలకు రక్షణ కవచం ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీయేనని, కాంగ్రెస్, బీజేపీలకు నమ్మి ఓటేసిన ప్రజలను నట్టేట ముంచారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు దెబ్బతిన్నాయని, వివిధ వర్గాల ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా పదవుల కోసం పాకులాడుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడుతున్నదని, కేసీఆర్ పదేళ్ల పాలనలో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా చేపట్టిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకుల మాయమాటలు నమ్మి ఓటేస్తే అందరినీ మోసం చేసి.. రాష్ర్టాన్ని తిరోగమనంలోకి పయనించేలా చేస్తున్నారని విమర్శించారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్, కాపు సీతాలక్ష్మి, వేల్పుల దామోదర్, రావులపల్లి రాంప్రసాదరావు, కొట్టి వెంకటేశ్వరరావు, సంకుబాపన అనుదీప్, ప్రసాద్ గౌడ్, సింధు తపస్వి పాల్గొన్నారు.