లయకారుడు.. గరళ కంఠేశ్వరుడు.. ప్రళయ రుద్రుడు.. శివుడు..! ఓం నమః శివాయ అనే మంత్రం సృష్టికి మూలాధారం.. లోకకల్యాణానికి ఆధారం.. నాగ భూషణుడి దయలేనిది మనుగడ లేదు.. శరణం అంటే చాలు అభయమిచ్చే బోళా శంకరుడు.. శివయ్యను నిండార కొలుచుకునే పండుగే మహాశివరాత్రి.. మంగళవారం ఉమ్మడి జిల్లాలోని అన్ని శివాలయాల్లో ప్రత్యేక పూజలు జరుగనున్నాయి.. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలతో స్తుతించేందుకు భక్తజనం సన్నద్ధమయ్యారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని గణేశ్ టెంపుల్ ఆవరణలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి ఆలయం, ప్రగతినగర్ శివాలయం, అన్నపురెడ్డిపల్లి శైవక్షేత్రంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేయనున్నారు.
మణుగూరు రూరల్, ఫిబ్రవరి 27 : భక్తుల కోర్కెలు తీర్చి కొంగు బంగారంగా వెలుగొందుతున్న మణుగూరు నీలకంఠేశ్వరాలయం కాకతీయుల కాలం నాటిదిగా ప్రసిద్ధి. దేశంలోనే రెండో చోట శివుడు ద్విలింగ దర్శనం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. మహాశివరాత్రి, కార్తీక మాసాల్లో వేలాది భక్తులతో పూజలందుకునే పాతాలలింగేశ్వరుడిగా కొలిచే నీలకంఠేశ్వరుడి ఆలయానికి కాకతీయులు ఆరాధించేవారని పూర్వీకులు చెబుతున్నారు. కాకతీయుల కాలంలో ఓరుగల్లులోని వెయ్యి స్తంభాల ఆలయ నిర్మాణ సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాత మణుగూరులో గోదావరి చెంతనే శివాలయం నిర్మాణం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలకు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, జనగాం జిల్లాల నుంచి భక్తులు నీలకంఠేశ్వరుడి దర్శనం కోసం పోటెత్తుతారు.
ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 27 : ఐదురోజులపాటు అంగరంగ వైభవంగా జరుగనున్న తీర్థాల(కూడలి) జాతరకు సంఘమేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబైంది. జిల్లా నుంచే కాకుండా భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల నుంచి సైతం లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. ఖమ్మంరూరల్ మండలంలోని తీర్థాల గ్రామంలో జరిగే జాతరకు సమీప గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రెండు, మూడురోజులపాటు అక్కడే ఉండి జాతరను ఆస్వాదిస్తుంటారు. ఈ సంవత్సరం కూడా మూడు లక్షల మంది భక్తులు రావచ్చని అధికారుల అంచనా. ఈ నెల 28న సోమవారం పాంచాహ్మిక ప్రయక్త ధ్వజారోణం, రాత్రి 11గంటలకు గణపతి పూజ, అఖండ ప్రతిష్ఠ, వాస్తుపూజ, వాస్తు హోమం, బలిహరణం, ధ్వజారోహణం కార్యక్రమాలతో జాతర ప్రారంభంకానున్నది. మార్చి 1వ తేదీ మంగళవారం ఉదయం బలిప్రదానం, సాయంత్రం ఎదుర్కోలు నిర్వహిస్తారు. అర్ధరాత్రి 12గంటలకు శివపార్వతుల కల్యాణం జరుగనున్నది. 2వ తేదీ బుధవారం ఉదయం ఔపోసనం, బలిహరణం, సాయంత్రం 6గంటలకు ఔపోసనం, బలిహరణం జరుగనున్నది. 3వ తేదీ గురువారం ఉదయం ఔపోసనం, బలిహరణం, నాగబలి పూజల అనంతరం రాత్రి పూర్ణాహుతి ఉంటుంది. చివరిరోజు 4వ తేదీ శుక్రవారం దోపు ఉత్సహం, వసంతోత్సవంతో పరిసమాప్తి కానున్నది.
కూసుమంచి, ఫిబ్రవరి 27 : వెయ్యి సంవత్సరాల చరిత్రకు ఆనవాలుగా నిలిచిన కాకతీయుల కళావైభవం కూసుమంచి శివాలయం. నేటికీ చెక్కు చెదరని కట్టడాలు.. అబ్బురపరిచే కళానైపుణ్యం దాని సొంతం. కాకతీయుల శివభక్తికి నిదర్శనంగా నాడు ఎలాంటి క్రేన్లు, ఆధునిక పరికరాలు లేకపోయినా మనుషులతో కాకతీయల రాజు గణపతి దేవుడు ప్రతిష్టించిన కూసుమంచి శివలింగాకారం దేశంలోనే పెద్ద శివలింగాల్లో ఒకటి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రానికి ఉత్తరాన నక్షత్రాకారంలో నిర్మించిన అద్భుతమైన శిల్పాలు, పెయింట్ సహితం వేయలేరేమో అనే విధంగా కళా ప్రతిభ నేటికీ ఆశ్చర్యపరుస్తున్నది. సూర్యుడు తూర్పున ఉదయించే సమయంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉత్తరం వైపు సూర్యుడు ఉదయించినా, దక్షిణాయన పుణ్యకాలంలో దక్షిణంలో సూర్యుడు ఉదయించినా సూర్యకిరణాలు శివలింగాకారంపై పడేవిధంగా మూలవిరాట్ శివలింగాకారం నిర్మించడం విశేషం.
సారపాక, ఫిబ్రవరి 27 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని మోతే పట్టీనగర్ గ్రామంలో పవిత్ర గోదావరి నదీతీరాన మోతేగడ్డ భద్రకాళీ సమేత వీరభద్రుడి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. ఈ నెల 28నుంచి మార్చి 5వ తేదీ వరకు ప్రత్యేక పూజలతోపాటు మార్చి 1న భద్రకాళీ సమేత వీరభద్రస్వామి వారి తిరుకల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయాన్ని కాకతీయుల కాలంలో సుమారు 600 యేండ్ల క్రితం నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. వీరభద్రుడు గోదావరి నది మధ్యలో వెలిసినట్లుగా పలురకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. వీరభద్రస్వామిని భద్రకాళిగా ఉన్న పార్వతి వరించి మహాశివరాత్రి పర్వదినాన వివాహం చేసుకుంది. నాటి నుంచి స్వామివారి వివాహాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వివాహాన్ని పూర్తిగా గిరిజన సంప్రదాయంలోనే నిర్వహిస్తారు. తెలుగు రాష్ర్టాల భక్తులతోపాటు ఛత్తీస్గఢ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తారు. ఆలయానికి మోతే పుష్కరఘాట్ వరకు భక్తులు వాహనాల్లో చేరుకోవచ్చు. అక్కడి నుంచి గోదావరి పడవలో ప్రయాణించి లేదా గోదావరిలో నీటిని బట్టి నడిచి గోదావరి నదీతీరంలో ఉన్న శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి చేరుకోవచ్చు.
కారేపల్లి, ఫిబ్రవరి 27 : ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలోని పోలంపల్లి గ్రామంలో జరిగే కోటిలింగాల జాతర ఇల్లెందు డివిజన్లో రెండో అతిపెద్దదిగా ప్రసిద్ధి. మహాశివరాత్రిని పురస్కరించుకొని మూడ్రోజుల పాటు వేలాది మంది భక్తులు తరలివచ్చి పక్కనే ఉన్న వాగులో పుణ్యస్నానాలు చేసి శివున్ని దర్శించుకొని మొక్కలు చెల్లించుకుంటారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా భక్తులు తరలివస్తుంటారు. ఆలయ ప్రాంగణంలో 108 శివలింగాలు, నాగేంద్రుడి విగ్రహం, సాలెపురుగు వంటి ఆకృతులను ప్రతిష్ఠించారు. కొన్ని దశాబ్ధాలుగా పోలంపల్లికి చెందిన ఆదివాసీ కుటుంబం జాతరను నిర్వహిస్తున్నారు. అదేవిధంగా గేట్ కారేపల్లి బుగ్గవాగు సమీపంలోని శ్రీఉమాసమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి కల్యాణ ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.