ఖమ్మం :బులియన్ మార్కెట్లో బంగారం ధరతో పోటీపడుతున్నట్లుగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తెల్లబంగారం(పత్తి ) ధర పోటీపడుతుంది. సాగు తగ్గడంతోపాటు, ఆశించిన మేర దిగుబడులు రాకపోయినప్పటకీ సాగు చేసిన రైతులకు మార్కెట్లో పత్తిపంట సిరులు కురిపిస్తుంది. ఎన్నడూ లేని విధంగా మంగళవారం అత్యంతగా ధర పలికింది. పంట సీజన్ ప్రారంభం నుంచే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) మద్దతు ధర కంటే అధికంగా పలుకుతుండటం విశేషం.
ఈ సంవత్సరం సీసీఐ మద్దతు ధర క్వింటాల్ రూ 6వేలు కాగా, సీజన్ ప్రారంభంలోనే ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ రూ. 7వేల చొప్పున కొనుగోలు చేశారు. దీంతో జిల్లాలో ఎక్కడా సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రతి నెల క్రమం తప్పకుండా పెరుగుతున్న పత్తిధరలు నెలాఖరులోనూ రికార్డు స్థాయి ధర పలికింది.