ప్రజా పంపిణీకి చెందిన చౌకదుకాణాల వ్యవస్థలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథులుగా పనిచేస్తున్న రేషన్ డీలర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నయవం చనకు గురిచేసింది. ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని బాజాలు వాయిస్తూ పేదలను ఆకట్టు కునే ప్రయత్నం చేస్తున్న రేవంత్‌రెడ్డి సర్కారు.. ఆ సన్న బియ్యం పంపిణీ చేసే రేషన్ డీలర్లను మాత్రం చిన్నచూపు చూస్తోంది. రేషన్ డీలర్లకు కమీషన్‌ను రూ.300కు పెంచుతామని, గౌరవ వేతనం రూ.5 వేలు ఇస్తామని హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. ఏకంగా ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ప్రకటనలు చేసింది. కానీ.. వాటిని నమ్మి ఓట్లేసిన రేషన్ డీలర్లను, వారి కుటుంబాలను మాత్రం నట్టేట ముంచింది.
-రఘునాథపాలెం, మార్చి 29
Congress Govt | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. కానీ.. తాను ఇచ్చిన హామీలపై కనీస స్పందన కూడా కన్పిచండం లేదు. దీంతో రేషన్ డీలర్లే అనేకమార్లు ఆ హామీలను ప్రభుత్వానికి గుర్తు చేశారు. తమ సమస్యలను సర్కారు దృష్టికి తీసుకెళ్లారు. అయినా, చలనం లేకపోవడంతో ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతిపత్రాలు అందించారు. తమ సమస్యలపై అసెంబ్లీలో గళమెత్తాలని విన్నవించారు.
కానీ.. నెలలు గడుస్తున్నా వీరు గళమెత్తింది లేదు. ప్రభుత్వం ప్రకటనలు చేసింది లేదు. హామీల అమలుకు అడుగు వేసింది లేదు. కనీసం సన్న బియ్యం పంపిణీ నాటికైనా స్పందన ఉంటుందేమోనని ఎదురుచూస్తున్న రేషన్ డీలర్లకు మళ్లీ ఆశాభంగమే మిగిలింది. రేషన్ డీలర్లకు కమీషన్ పెంచే ఆలోచనే లేదంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ప్రకటనతో సర్కారు మోసం బట్టబయలైంది.
అంతేగాక, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెంచిన కమీషన్‌పై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసత్య ప్రకటనలు చేశారు. కమీషన్‌ను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలోనే పెంచినప్పటికీ.. తమ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే పెంచామంటూ సాక్షాత్తూ శాసనసభలోనే సత్యదూరమైన మాటలు చెప్పారు.
చాలీచాలని కమీషన్‌తో ఎంతోకాలంగా దుర్భరమైన జీవితాలను గడుపుతున్న తమను కాంగ్రెస్ సర్కారు మోసం చేయడంపై రేషన్ డీలర్లు మండిపడుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వ పాలనలోనే తమకు న్యాయం జరిగిందని, రూ.90 పైసలుగా ఉన్న కమీషన్‌ను రూ.1.50కు పెంచారని గుర్తు చేసుకున్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చేవరకూ ప్రభుత్వంపై పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు ఖమ్మం జిల్లాకు చెందిన రేషన్ డీలర్ల సంఘాల నేతలు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచైనా సరే తమ డిమాండ్లను నెరవేర్చుకుంటామంటూ స్పష్టం చేస్తున్నారు.
రేషన్ డీలర్లకు కమీషన్ రూ.300 చేస్తామని, గౌరవ వేతనం రూ.5 వేలకు పెంచుతామని, హెల్త్‌కార్డులు అందిస్తామని, ఇతరత్రా సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ మ్యానిఫెస్టోలో ప్రకటించింది. కానీ.. ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా ఆ హామీలను పరిష్కరించలేదు. పైగా డీలర్ల కమీషన్ పెంచే ఆలోచన లేదంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో చేసిన ప్రకటనతో కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసినట్లు స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌ను నమ్మి నయవంచనకు గురయ్యాం.
-మోటమర్రి చంద్రశేఖర్‌రావు, రేషన్ డీలర్ల సంఘం, ఖమ్మం జిల్లా గౌరవాధ్యక్షుడు
ఎన్నికల్లో హామీ ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా కమీషన్ పెంచే ఆలోచనే లేదంటూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటన చేయడం సరైనది కాదు. కమీషన్ పెంచేది లేదంటూ అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం మమ్మల్ని ఎంతగానో బాధించింది. కమీషన్ పెంచుతామంటూ ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ.. మోసపోయాం. చాలీచాలని కమీషన్‌తో కుటుంబాలను పోషించుకోలేకపోతున్నాం. కమిషన్ పెంచే వరకు ప్రభుత్వంపై పోరాడుతాం.
-గోళ్ల మురళి, రేషన్ డీలర్ల సంఘం నాయకుడు, ఖమ్మం