హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ఎంఎన్జే క్యాన్సర్ దవాఖాన డైరెక్టర్ డాక్టర్ బెంజిమెన్పై ప్రభుత్వం వేటు వేసింది. దవాఖాన పరిపాలనతోపాటు నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, బిల్లుల మంజూరు, మందుల కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో నిమ్స్ ఆంకాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివుడికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ శుక్రవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాగా, ఎంఎన్జే దవాఖాన ఇన్చార్జ్ డైరెక్టర్గా నిమ్స్ వైద్యుడిని నియమించడంపై ఆ దవాఖాన వైద్యులు మండిపడుతున్నారు. డీఎంఈ పరిధిలో పూర్తిగా ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్ అయిన ఎంఎన్జేలో ఎంతోకాలం నుంచి సీనియర్ వైద్యులు పనిచేస్తున్నారని, వారిపై సంబంధం లేని సంస్థకు చెందిన జూనియర్ వైద్యుడిని డైరెక్టర్గా ఎలా నియమిస్తారని ప్రశ్నిస్తున్నారు. డీఎంఈ పరిధిలోని ఎంఎన్జేలో, ఇతర దవాఖానల్లో అర్హులు లేరా అని ప్రశ్నిస్తున్నారు.