తాండూర్ : మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ ( UBI ) ఎదుట సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు ( Singareni Retired Workers ) సోమవారం నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా ( Protest ) నిర్వహించారు.
యూనియన్ బ్యాంకులో ఖాతాలు కలిగి ఉన్న కోల్ మైన్స్ పెన్షన్ దారులకు 2024 ఒప్పందం ప్రకారం 70 ఏళ్లలోపు పెన్షనర్లకు రూ. 30లక్షల ప్రమాద బీమా. రూ. 10లక్షల సహజ మరణ బీమా కల్పించడంలో బ్యాంక్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గజ్జెల్లి వెంకటయ్య మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా యూనియన్ బ్యాంక్ యజమాన్యం సింగరేణి రిటైర్డ్ బొగ్గు పెన్షన్ దారులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం, పది రోజుల్లోగా తమకు బీమా సౌకర్యం కల్పించకపోతే జిల్లా వ్యాప్తంగా కుటుంబాలతో సహా శాంతియుతంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అసం రాజయ్య, తగరం రాజన్న, తోటపేల్లి ఎల్లయ్య, దేవరకొండ మౌగిలి, కే దుర్గా స్వామి, కే లక్ష్మి, ఎర్రయ్య, సీ రాయలింగు, ఎడ్ల గొంతయ్య, మాదారం, తాండూర్, తంగళ్ళపల్లి, కొత్తపల్లి, కొత్తగుడిసెలు వివిధ ప్రాంతాలకు చెందిన సింగరేణి రిటైర్డు కార్మికులు పాల్గొన్నారు.