అశ్వారావుపేట, జూలై 14 : నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌డీలర్లకు ఇవ్వాల్సిన కమీషన్‌ను చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఐదునెలల కమీషన్ కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డీలర్లు ఎదురుచూస్తున్నారు. కమీషన్ అందకపోవడంతో దుకాణం అద్దె, దిగుమతి, గుమస్తా ఖర్చులు భారంగా మారాయి.
జిల్లాలో ప్రతి నెలా బియ్యం పంపిణీ కోసం ప్రభుత్వం డీలర్లకు రూ.70 లక్షల నుంచి రూ.84 లక్షల వరకు చెల్లిస్తున్నది. గడిచిన ఐదునెలల కాలానికి కమీషన్ బకాయిలు రూ.3.50 కోట్ల నుంచి రూ.4.20 కోట్లకు చేరాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండుసార్లు కమీషన్ పెంచి రేషన్‌డీలర్లకు ఆర్థికభరోసా కల్పించడంతో సంతృప్తిగా పనిచేశారు. ఇదిలాఉంటే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా కమీషన్ సైతం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని కాంగ్రెస్ ప్రభుత్వంపై రేషన్‌డీలర్లు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేస్తున్నది. ఏజెన్సీ గ్రామాల్లో జీసీసీ(గిరిజన సహకార సంస్థ), మైదాన ప్రాంతాల్లో రేషన్‌డీలర్ల ద్వారా పంపిణీ జరుగుతున్నది. లబ్ధిదారులకు రేషన్‌బియ్యాన్ని పంపిణీ చేస్తున్నందుకు గాను ప్రభుత్వం డీలర్లకు కమీషన్ చెల్లిస్తున్నది. ఒక్కో క్వింటాకు రూ.140 చొప్పున డీలర్లకు అందుతున్నది. ఇందులోనే దుకాణం అద్దె, బియ్యం దిగుమతి, గుమస్తాల ఖర్చులను డీలర్లు భరించాల్సి ఉంటుంది. అయితే గత ఐదునెలలుగా ప్రభుత్వం డీలర్లకు కమీషన్ చెల్లించటం లేదు. దీంతో నిర్వహణ భారమై కమీషన్ కోసం డీలర్లు ఎదురుచూస్తున్నారు.
ఏప్రిల్, మే నెలలతోపాటు జూన్ నెలలో ఒకేసారి ప్రభుత్వం మూడునెలల బియ్యం పంపిణీ చేసింది. ప్రతి నెలా జిల్లాలో 443 రేషన్ దుకాణాల ద్వారా సుమారు 50 నుంచి 60వేల క్వింటాళ్ల బియ్యం పంపిణీ జరుగుతోంది. ఈ లెక్కన క్వింటాకు ప్రభుత్వం డీలర్లకు చెల్లించే కమీషన్ నెలకు రూ.70 లక్షల నుంచి రూ.84 లక్షలు ఉంటుంది. ఐదునెలలకు ఈ కమీషన్ బకాయి రూ.3.50 కోట్ల నుంచి రూ.4.20 కోట్లకు పేరుకుపోయింది. మధ్యతరగతి వర్గానికి చెందిన తమకు ప్రభుత్వం ప్రతి నెలా కమీషన్‌ను క్రమం తప్పకుండా చెల్లించాలని డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
నిరుపేదల కోసం పనిచేస్తున్న రేషన్‌డీలర్ల కష్టాన్ని నాటి కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. పదేళ్ళ పాలనలో రెండుసార్లు కమీషన్‌ను భారీగా పెంచి ఆర్థిక భరోసా కల్పించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం క్వింటాకు కమీషన్ రూ.20 మాత్రమే ఉండేది. దీనిని బీఆర్ఎస్ ప్రభుత్వం 2016లో ఏకంగా 50 పెంచి రూ.70 చొప్పున చెల్లించింది. 2022లో మళ్లీ రూ.70 పెంచి రూ.140 చేసింది. దీంతో డీలర్లు నాడు సంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ హామీలతో మోసపోయామని డీలర్లు ఆవేదన చెందుతున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేషన్‌డీలర్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించింది. ప్రస్తుతం ఇస్తున్న బియ్యం పంపిణీ కమీషన్‌ను రూ.140 నుంచి రూ.300లకు పెంచుతామంటూ ఆర్భాటంగా ప్రకటించింది. దీంతోపాటు గౌరవ వేతనం రూ.5 వేలు చొప్పున అందిస్తామంటూ కూడా గొప్పలు చెప్పుకుంది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ప్రతి నెలా ఇచ్చే కమీషన్ కూడా ఇవ్వలేకపోతున్నది.
ప్రభుత్వం నుంచి కమీషన్ సకాలంలో అందటం లేదు. దీంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. దుకాణం అద్దె, బియ్యం దిగుమతి, గుమస్తాల ఖర్చు భారంగా ఉంది. కమీషన్ తక్కువగా ఉన్నా బతుకుదెరువు కోసం పని చేస్తున్నాం. క్రమం తప్పకుండా నెలావారీగా ప్రభుత్వం రేషన్‌డీలర్లకు కమీషన్ చెల్లించాలి.
– నాగుబండి పుల్లారావు, రేషన్‌డీలర్, అశ్వారావుపేట
కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్‌డీలర్లకు కమీషన్ చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తున్నది. కమీషన్ రూ.300 పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడమే కాకుండా రూ.5 వేల గౌరవవేతనం అందిస్తామన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరవుతున్నా ఆ ఊసే లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలి.
– కొడాలి వెంకటేశ్వరరావు, రేషన్‌డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, అశ్వాపురం