భద్రాచలం, జనవరి 25: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో రథ సప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో క్యూలైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. అలాగే, ఉదయం 6 గంటల సమయంలోనే స్వామి వారు భక్తులకు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు.
అదేవిధంగా, ఆలయంలో మూలవరులకు రథ సప్తమి సందర్భంగా విశేష అర్చన, అభిషేకం నిర్వహించడంతోపాటు ఆర్జిత సేవలో భాగంగా బంగారు పుష్పాలతో స్వామివారికి సేవ నిర్వహించారు. ఇదిలా ఉండగా ఉదయం నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తడంతో రామాలయం వీధులన్నీ కిటకిటలాడాయి. వరుస సెలవుదినాలు కావడంతో పాపికొండల విహార యాత్రకు వెళ్లే భక్తులు రావడంతో రామాలయ పరిసరాలు భక్తులతో నిండిపోయాయి. అలాగే, నిత్యకల్యాణంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదేవిధంగా, సాయంత్రం చంద్రప్రభ వాహనంపై స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించారు.