ఖమ్మం, సెప్టెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): వానకాలం సీజన్ వచ్చిందంటే చాలు కోనసీమను తలపించే ఖమ్మంజిల్లాలోని సాగర్ ఆయకట్టు ప్రాంతంలో నేడు నెర్రెలుబారిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమా అని జిల్లాలో ఈ విచిత్ర పరిస్థితి దాపురించింది. యాసంగిలో సాగర్ ప్రాజెక్టు అడుగంటడంతో సాగునీటికి కటకట అయ్యింది.
ఆలస్యమైనా వరుణుడు కరుణించడంతో జిల్లావ్యాప్తంగా సుమారుగా 4లక్షల ఎకరాలకుపైగా సాగు చేశారు. సాగర్ ఎడమ కాలువ పరిధిలోనే 2.50 లక్షల ఎకరాలు సాగు చేశారు. ఆయకట్టు పరిధిలో వరి, మక్క, ఇతర వాణిజ్య పంటలను రైతులు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వరి పొట్టదశకు చేరుకునే సమయంలో జిల్లావ్యాప్తంగా రికార్డుస్థాయి వర్షపాతం నమోదైంది. సాగర్ కాలువ కూడా పొంగి ప్రవహించింది. కాలువకు పలుచోట్ల గండ్లు పడడంతో నీటి విడుదల ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు 20రోజులు గడుస్తున్నా గండ్లను పూడ్చకపోవడంతో పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు.
ప్రకృతి ప్రకోపం, యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి ఈ వానకాలం సీజన్లో సాగర్ కాలువ కింద పంటలు చేజారిపోయే అవకాశం కనపడుతున్నది. సాగర్ ఆయకట్టు కింద 17 మండలాలు ఉండగా, నాలుగు మండలాలకు మాత్రమే కాలువ కవరేజ్ లేదు. జిల్లా రైతాంగం సాగర్ ఎడమ కాలువ మీదనే ఆధారపడి ఉంది. వానకాలంలో ఆయకట్టు పరిధిలో 1.20 లక్షల ఎకరాల వరి పంటను సాగు చేయగా, ప్రస్తుతం పొట్ట దశకు చేరుకున్నాయి. మరో రెండో ప్రధాన పంట పత్తిపంట చేతికి వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలో పొలాలకు ఎక్కువ నీరు ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రభుత్వంలో ముగ్గురు మంత్రులు ఉన్నా పట్టించుకోకుండా, సాగర్ ఎడమ కాల్వకు పడిన గండ్లను పూడ్చని యంత్రాంగ తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 20 రోజులు కావస్తున్నా కాలువ గండ్లను పూడ్చలేని దుస్థితిలో ప్రజాప్రభుత్వం ఉందని వామపక్ష నాయకులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సాగర్ కాలువ గండ్లను తక్షణమే పూడ్చి ఇసుక మేటలు వేసిన పంట పొలాలకు, వరదలో కొట్టుకుపోయిన పంట పొలాలకు పరిహారం అందజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రాజకీయాలకు అతీతంగా రైతులను కూడగట్టి ప్రభుత్వంపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
గార్లపాడు రెవెన్యూలో కౌలు తీసుకొని మూడు ఎకరాల్లో పత్తి సాగు చేశాను. 15రోజులుగా సాగర్జలాలు రాకపోవడం వల్ల పత్తి ఎండిపోతుంది. రూ.1.20 లక్షలు అప్పుగా తెచ్చి పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం ఎకరాకు రెండు క్వింటాళ్ల పత్తి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ పంటను పీకివేసి మరో ప్రత్యామ్నాయ పంట వేసుకోవాల్సిందే. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించి రైతులకు పరిహారం అందించాలి.
– బాలబోయిన కృష్ణ, ముష్టికుంట్ల, ఖమ్మం జిల్లా
ఇలాంటి దుర్భర పరిస్థితి నేను ఎన్నడూ చూడలేదు. ప్రాజెక్టుల్లో నీరు లేని రోజులు చూశాం. ప్రస్తుతం ప్రాజెక్టులు నిండుకుండలా మారి గేట్లు ఎత్తి నీటిని బయటకు వదులుతున్నారు. ఉన్న నీటిని పంట పొలాలకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
– భాగం వెంకటేశ్వరరావు, సిద్ధిక్నగర్, ఖమ్మం జిల్లా
నాకు 4 ఎకరాలు ఉంది. దీనికి మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి, వరి సాగు చేశా. మిర్చి పైరుకు ఇప్పటికే ఎకరాకు రూ.30 వేలు ఖర్చయింది. ఇప్పుడు కండ్ల ముందే పంట ఎండిపోతుంది. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది.
– ధరావత్ బాలు, మేకాలకుంట, ఖమ్మం జిల్లా
నేను 30 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశా. 6 ఎకరాల్లో మిర్చి, 3 ఎకరాల్లో మాగాణి కేవలం సాగర్జలాలపై ఆధారపడి సాగు చేస్తున్నా. పంటపైర్లు ఏపుగా పెరుగుతున్న సమయంలో సాగర్ జలాలను నిలిపివేశారు. గండ్ల కారణంగా ఈ నీటిని బంద్ చేయడం వల్ల నాకు తీవ్రనష్టం కలిగింది.
– కొమ్మినేని ఉపేందర్, రావినూతల, ఖమ్మం జిల్లా