కారేపల్లి, ఏప్రిల్ 19 : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య బోధన లభిస్తుందని ఖమ్మం జిల్లా సింగరేణి మండల విద్యాశాఖ అధికారి జి.జయరాజు అన్నారు. మండల పరిధిలోని సూర్యతండాలో గల ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలను ఆ పాఠశాల హెచ్ఎం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. ఎంఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అనుభవంతో పాటు అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారన్నారు. చిన్న వయస్సులో విద్యార్థులను హాస్టల్స్లో చేర్పించడం వల్ల వారికి కుటుంబ సభ్యులపై ప్రేమ, అనురాగాలు తగ్గుతాయని, ఈ ప్రభావం తల్లిదండ్రులపై వృద్ధాప్యంలో పడుతుందన్నారు.
పాఠశాల ఉపాధ్యాయుడు వీరన్న తన తండ్రి చంద్రు పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా పాఠశాలలో విద్యనభ్యసించే విద్యార్థులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలను తమ ఫౌండేషన్ ద్వారా కల్పించనున్నట్లు ప్రకటించారు. గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
సూర్యతండా మాజీ సర్పంచ్ చర్పల శాంతి- హచ్చు నాయక్ పాఠశాలకు మూడు గుంటల స్థలాన్ని వితరణగా ఇచ్చారు. అదేవిధంగా 150 మంది విద్యార్థులకు ప్లేట్లు, ఇతర సామాగ్రిని అందజేసినట్లు తెలిపారు. అలాగు సొంత ఖర్చులతో పాఠశాలలో విద్యుత్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద హర్యానాయక్, విశ్వనాధపల్లి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం పద్మ, ఉపాధ్యాయులు బాస్, రామ్ కోటి, వీర్య నాయక్, వనజ, శ్యామ్లాల్, గ్రామ పంచాయతీ కార్యదర్శి భార్గవి తేజ, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
Karepalli : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన : ఎంఈఓ జయరాజు