ఖమ్మం, జూలై 13 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే భద్రాచలంతోపాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు.
ముంపు ముప్పు కాళేశ్వరం వల్ల కాదని, దిగువన ఏపీలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రభావం వల్లేనని స్పష్టం చేశారు. ఆ ముంపు నివారణకు, భద్రాచలం ప్రాంత ప్రజల రక్షణ కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా, కనీసం సమీక్ష జరపకుండా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. పోలవరం విషయాన్ని పక్కదారి పట్టిస్తూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారం చేయడం బాధ్యతా రాహిత్యమని విమర్శించారు.