ఖమ్మం, అక్టోబర్ 25 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపును కాంక్షిస్తూ శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో పువ్వాడ అజయ్ మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, ప్రజలు మరోసారి ఆయన పాలనను కోరుకుంటున్నారని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మహోన్నత వ్యక్తి అని, ఆయన ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించేవారని అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం విశేషంగా కృషి చేశారని గుర్తుచేశారు. గోపినాథ్ చనిపోయి భార్య సునీత ఏడుస్తుంటే సానుభూతి చూపించకపోగా ఓట్ల కోసం మంత్రులు సైతం నీచంగా మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చి న హామీలను నెరవేర్చకుండా నీచపు ఆలోచనలు చేస్తూ ఎలాగైనా ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తుందన్నారు. గోపినాథ్ పిల్లలు తండ్రి పోయి పుట్టెడు బాధలో ఉండి తల్లి కోసం ప్రచారం చేస్తుంటే వారి మీద కేసులు పెట్టి భయందోళనకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా సునీత గెలుపు ఖాయమని, సునీతను గెలిపించి పార్టీ అధినేత కేసీఆర్‌కి కానుకగా ఇస్తామని అన్నారు. ప్రచారంలో అజయ్‌తోపాటు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పాల్గొన్నారు.