ఖమ్మం, జనవరి 5: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఏడాదంతా ఉద్యమాలు, పోరాటాలు చేస్తామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఈ నెల 7న జరగబోయే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఖమ్మం నగరంలోని తన నివాసంలో సోమవారం జరిగిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో అజయ్‌కుమార్ మాట్లాడారు. 7న ఖమ్మంలోని తెలంగాణ భవన్లో కేటీఆర్ బీఆర్ఎస్ సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను సత్కరించి, అనంతరం కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారని తెలిపారు. తొలుత వెయ్యి బైక్‌లతో ర్యాలీ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు.
అనేక మోసపు వాగ్దానాలు, హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లయినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. తన ఆరోగ్యం బాగున్నదని, ఇకపై కార్యకర్తలకు 24 గంటలు అందుబాటులో ఉంటానని, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటానని చెప్పారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను గెలుచుకునేలా కార్యకర్తలంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు. అధికారులు, పోలీసులతో బెదిరించినా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకే పట్టం కట్టారన్నారు. ఇప్పటికి ఖమ్మంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లను, కార్యకర్తలను బెదిరిస్తున్నారని, కాంగ్రెస్‌లో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని అజయ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఖమ్మం నగరం అభివృద్ధి చెందిందని, ఇది ప్రజలందరికీ తెలుసని అన్నారు. పార్టీ గుర్తులపై జరిగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుదని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణకు జరుగుతున్న జల దోపిడీపై కేసీఆర్ మాట్లాడితే సహించని రేవంత్‌రెడ్డి, మంత్రులు.. కేసీఆర్ అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఆయనకు శాపనార్థాలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. గోదావరి, కృష్ణా బేసిన్లలో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై సీఎం సమాధానం చెప్పాలని అజయ్ డిమాండ్ చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కేసీఆర్ ఉద్యమం చేశారని, అలాంటి కేసీఆర్ నీళ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడరని స్పష్టం చేశారు. సోనియాను బలిదేవత అని అన్న రేవంత్ ఈరోజు తెలంగాణ దేవత అని అనడం విడ్డూరంగా ఉందన్నారు. గులాబీ జెండా లేకపోతే తెలంగాణ అనేది లేదని, తెలంగాణకు పేటెంట్ కేసీఆర్ అని అజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ కోసం ప్రశ్నించే హక్కు కేసీఆర్‌కు మాత్రమే ఉందన్నారు.
సీతారామకు 13 వేల కోట్ల నుంచి 19 వేల కోట్లకు అంచనాలు పెంచారే తప్ప ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. ‘కేసీఆర్ చావాలి, ఖమ్మంలో అజయ్ చావాలి, హరీశ్‌రావును బొందపెట్టాలి’ వంటి బూతులు తప్ప రేవంత్‌రెడ్డికి మంచి మాటలు రావన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సీనియర్ నేతలు ఆర్జేసీ కృష్ణ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా మాజీ చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కార్పొరేటర్లు పసుమర్తి రామ్మెహన్‌రావు, దాదే అమృతమ్మ, నాగండ్ల కోటి, కూరాకుల వలరాజు, పల్లా రోజ్లీనా, జ్యోతిరెడ్డి, రఘునాథపాలెం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు వీరూనాయక్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఖమర్, నాయకులు ముక్కాల రాజేశ్, రుద్రగాని ఉపేందర్, తోట రామారావు, తోట వీరభద్రం, శీలంశెట్టి వీరభద్రం, బొమ్మెర రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.