ఖమ్మం, ఫిబ్రవరి 2: తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా తీర్చిదిద్ది, దేశంలోనే ప్రత్యేకంగా నిలిపిన ఘనత నాటి సీఎం కేసీఆర్‌కు దక్కిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ క్యాలెండర్‌ను, డైరీని ఆయన ఆదివారం నగరంలోని తన నివాసంలో పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘రేవంత్‌రెడ్డి పాలన బాగుందా, ఫామ్‌హౌస్ పాలన బాగుందా’ అని, కాంగ్రెస్ పెట్టిన పోల్ సర్వేలో వారికే ఎదురుదెబ్బ తగిలిందని అన్నారు.
ఏడాది గడిచినా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా, కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నాయకులకు, ప్రభుత్వ పెద్దలకు ఈ పోల్ ద్వారా నెటిజన్లు కర్రు కాల్చి వాత పెట్టారని అన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్మాణాలను వదిలేసి, కూల్చివేతలు సాగిస్తున్నదని, అందరినీ రోడ్డున పడేస్తున్నదని విమర్శించారు. జనవరి 26 నుంచి రైతు భరోసా టకీ..టకీమని పడుతుందని సీఎం చెప్పినప్పటికీ, అనేకమంది రైతుల ఖాతాల్లో నేటికీ డబ్బులు జమ కాలేదని ధ్వజమెత్తారు. ‘మన ఖమ్మం.. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అందంగా ఉందో, ఇప్పుడు ఎంత అధ్వానంగా మారిందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు’ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేత వచ్చిందని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ శ్రేణులు సమరోత్సాహంతో పోరాడాలని పిలుపునిచ్చారు. ‘మీ అందరికీ కేసీఆర్, కేటీఆర్‌తోపాటు నేను కూడా అండగా ఉన్నాను’ అని భరోసా ఇచ్చారు. పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పగడాల నాగరాజు, కూరాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కర్నాటి కృష్ణ, మక్బూల్, బచ్చు విజయ్‌కుమార్, తాజుద్దీన్, కొల్లు పద్మ, కొత్త వెంకటేశ్వరరావు, నాగండ్ల కోటి, పసుమర్తి రామ్మోహన్రావు, బడిగం శ్రీనివాస్, పల్లా రోజ్లీనా, దాదె అమృతమ్మ, చిరుమామిళ్ల నాగేశ్వరరావు, కొప్పెర నర్సింహారావు, రఘు, పిన్ని కోటేశ్వరారవు, కొంటెమ్కుల వెంకటేశ్వర్లు, సత్యనారాయణ, వెంకట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.