ఖమ్మం, నవంబర్ 15: ఖమ్మం ప్రజలకు కంటి ముందు బీఆర్ఎస్ అభ్యర్థి, ఇంటి ముందు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కన్పిస్తుండగా వేరే పార్టీల అవసరం లేనేలేదని బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. అభివృద్ధిని అడ్డుకునే పార్టీలకు బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అందుకోసం కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ను గెలిపించాలని, మరింత అభివృద్ధికి చోటివ్వాలని కోరారు. ఖమ్మం నగరంలో బుధవారం పర్యటించిన ఆయన.. మామిళ్లగూడెం పెద్ద కూరగాయల మారెట్ యార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూరగాయల వ్యాపారులను, ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అభివృద్ధిని కాంక్షించే పార్టీ బీఆర్ఎస్ అని స్పష్టం చేశారు. కానీ దోచుకొని దాచుకునే పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. అసలు ఖమ్మం వ్యవసాయ మారెట్ను ఇకడి నుంచి గుర్రాలపాడుకు తరలిచేందుకు కుట్ర చేసిందే తుమ్మల నాగేశ్వరరావు అని స్పష్టం చేశారు.
కానీ ఇప్పుడు అదే తుమ్మల కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయాన్ని గమనించాలని కోరారు. ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ ఖమ్మం వచ్చి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే పెద్ద మారెట్ను తాము ఇకడి నుంచి తరలిస్తామంటూ దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. వారు వారి రాజకీయ లబ్ధికోసం తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన మారెట్ ఇకడి నుంచి మరెక్కడికీ వెళ్లదని స్పష్టంచేశారు. ఇంకా కొత్తవి వస్తాయని తేల్చిచెప్పారు. మారెట్ స్థానంలో ఆర్టీసీ డిపోను పెడతారంటూ వస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలెవరూ నమ్మవద్దని సూచించారు. ఎలాగైనా గెలవాలన్న స్వార్థంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాగే, కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల.. రాత్రి వేళల్లో బీఆర్ఎస్ నాయకులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని అన్నారు. మీరు వ్యాపారాలు ఎలా చేస్తారో చూస్తామంటూ బెదిరింపులకు దిగడం చూస్తుంటే వారు వారి ఓటమిని ముందే చూసినట్లు అనిపిస్తోందని అన్నారు. ప్రజలకు వారు ఏం చేశారో వివరించి గెలవాలి తప్ప బెదిరించి గెలవలేరని అన్నారు. ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నేతలు దోరేపల్లి శ్వేత, రాపర్తి శరత్, తోట రామారావు, మాటేటి నాగేశ్వరరావు, మాటేటి కిరణ్ పాల్గొన్నారు.