ఖమ్మం, అక్టోబర్ 26: మాయమాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారితోపాటు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఉన్నారు. యూసఫ్‌గూడా డివిజన్లోని కృష్ణనగర్, ఎల్ఎన్ నగర్లో ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు.
ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, కాంగ్రెస్‌కు ఓటేసి ప్రజలు మోసపోయారని అన్నారు. మహిళలకు రూ.2500, పింఛన్ రూ.4 వేలు, తులం బంగారం ఇస్తామని మభ్యపెట్టిందని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మొండి‘చేయి’ చూపించిదన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన పథకాలు, మాగంటి గోపినాథ్ చేసిన అభివృద్ధిని స్థానిక ప్రజలకు వివరించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రౌడీలు పెత్తనం చెలాయిస్తారని, ప్రజలు ఆ తప్పు చేయవద్దని, మాగంటి సునీతను గెలిపించి గోపినాథ్ రుణం తీర్చుకోవాలని ఓటర్లను అభ్యర్థించారు.