ఖమ్మం సిటీ, జూలై 18: ప్రస్తుత కష్టకాలంలో పార్టీ కోసం ఎవరైతే అంకితభావంతో పనిచేస్తారో, భవిష్యత్తులో వారికే సముచిత గుర్తింపు, పదవులు లభిస్తాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. బీఆర్ఎస్ ఖమ్మం టూటౌన్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఖమ్మంలోని తన నివాసంలో శనివారం ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో.. ఖమ్మం నగరంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ స్థాయి కార్యాచరణ గురించి సుదీర్ఘంగా చర్చించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారం వస్తుందంటే అనేకమంది పరుగులు పెట్టుకుంటూ వస్తారన్నారు.
కానీ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గులాబీ జెండా మోసిన కార్యకర్తలందరికీ ఇక నుంచి ఎల్లవేళలా ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తాజాగా ఖమ్మంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ మద్దతుదారుల ఓట్లు గల్లంతవకుండా, అక్రమంగా తొలగించబడకుండా ప్రతీ బీఎల్ఏ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు పేరూ జాబితాలో ఉండే విధంగా శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ బలోపేతమే ప్రధాన లక్ష్యమని, బూత్ కమిటీలు పూర్తిస్థాయిలో పనిచేసేలా నాయకులు బాధ్యత తీసుకోవాలని అజయ్‌కుమార్ సూచించారు. ప్రతీ బూత్ పరిధిలోని ఓటర్లతో నిరంతర సంబంధాలు కొనసాగిస్తూ, పార్టీ సిద్ధాంతాలు, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, ఇటీవల నెలకొన్న ప్రజా సమస్యలపై పార్టీ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఉపదేశించారు. బీఆర్ఎస్కు ఖమ్మం టూటౌన్ ప్రాంతం ఎంతో కీలకమైన ప్రాంతమని, సంస్థాగతంగా ఈ ప్రాంతంలో మరింత పటిష్టం చేయాల్సిన అవసరం నాయకులు, కార్యకర్తలపై ఉందని అన్నారు. రాబోయే రాజకీయ పరిణామాలు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రతీ బూత్‌ను బలమైన యూనిట్‌గా తీర్చిదిద్దుతూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
యువత, మహిళలు, విద్యార్థులు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలని అన్నారు. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా వినియోగించి బీఆర్ఎస్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా నాయకులు, కార్యకర్తల మధ్యన ఐక్యత, సమన్వయం, క్రమశిక్షణ వంటివి పార్టీ విజయానికి ఎంతో కీలకమని అన్నారు. ఈ నేపథ్యంలో అందరూ అంకితభావంతో పనిచేసి ఎన్నిక ఏదైనా, అది ఎప్పుడొచ్చినా ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండాను ఎగుర వేయించాలని పిలుపునిచ్చారు.
ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని టూటౌన్ ప్రాంతంలో కొనసాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ, పార్టీ సభ్యత్వ నమోదు గురించి బీఆర్ఎస్కు చెందిన మాజీ కార్పొరేటర్లు, బీఎల్ఏలతో మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తన నివాసంలో సుదీర్ఘంగా చర్చించారు. ఒక్కో బూత్ స్థాయిలో పనిచేస్తున్న బీఎల్ఏను పేరుపేరునా పిలుస్తూ, ప్రస్తుత పరిస్థితి గురించి ఆరా తీశారు. సమావేశానికి గైర్హాజరైన వారి వివరాలు, అందుకు గల కారణాలను సంబంధిత నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఇక నుంచి తాను ప్రతీ వారం సమీక్ష నిర్వహిస్తానని, పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని అన్నారు.
సభ్యత్వ నమోదును తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో చేపట్టి ప్రతీ కుటుంబాన్ని పార్టీతో అనుసంధానం చేయాలని సూచించారు. ఎవరైతే అలసత్వం వహిస్తారో వారి పట్ల ఒక తండ్రిలా, ఇంటికి పెద్ద కొడుకులా ఆగ్రహం ప్రదర్శిస్తానని స్పష్టం చేశారు. అంతమాత్రాన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోనని, అక్కున చేర్చుకుంటానని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ నేతలు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, శీలంశెట్టి వీరభద్రం, బత్తుల మురళీ, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, పొన్నం వెంకటేశ్వర్లు, ఎండీ తాజుద్దీన్, ఊట్కూరి రవికాంత్, షేక్ షకీనా, గాదె అనిల్ తదితరులు పాల్గొన్నారు.