వైరా టౌన్, జూన్ 22 : అన్నదాతల గోడుపట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, పైగా వారిది ప్రజాపాలన అంటూ గప్పాలు కొడుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. రైతులకు కనీసం ఎరువులు, గన్నీ బస్తాలు ఇవ్వలేని దైన్యంలో, దౌర్భాగ్యంలో ప్రభుత్వం ఉందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఓ వైపు అన్నదాతలు అరిగోసలు పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ డిజిటల్ సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్’పై పార్టీ వైరా నియోజకవర్గ బూత్‌స్థాయి ఏజెంట్లకు వైరాలో సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. పార్టీ సభ్యత్వ నమోదు వైరా నియోజకవర్గ ఇన్చార్జి ఆర్జేసీ కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో మాజీ మంత్రి అజయ్ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఎన్నికల హామీలను ఇంత వరకూ అమలు చేయలేదని విమర్శించారు.
రైతులకు రైతుభరోసా, రుణమాఫీ వంటివి అందించడంలో ప్రభుత్వంలో విఫలమైందని దుయ్యబట్టారు. మరి ఇలాంటి పాలనను ప్రజా పాలనని ఎలా అంటారని ప్రశ్నించారు. వైరా మున్సిపల్ చైర్పర్సన్ భర్త నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. బీఆర్ఎస్ నాయకులపైనా, కౌన్సిలర్లపైనా అవాకులు చవాకులు పేలితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.
ఈ సదస్సులో బీఆర్ఎస్ నాయకులు వనమా విశ్వేశ్వరరావు, కట్టా కృష్ణార్జునరావు, లకావత్ గిరిబాబు, బానోత్ మనీషా లక్ష్మీ, బానోత్ బాలాజీనాయక్, బాణాల వెంకటేశ్వరరావు, ముత్యాల సత్యనారాయణ, బొమ్మెర రామ్మూర్తి, షేక్ లాల్ మహ్మద్, కౌన్సిలర్లు కట్టా స్వరూపారాణి, మాదినేని సునీత, తిరుపతి శివకుమారి, దొంతబోయిన వెంకటేశ్వర్లు, చిలక చిన్న కోటయ్య తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ, కాంగ్రెస్ కలిసి పెద్ద కుట్రలు పన్నాయని ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టేందుకు బీఆర్ఎస్ బూత్ స్థాయి ఏజెంట్లు ఇంటింటికీ తిరిగి ‘ఎస్ఐఆర్’ గురించి ఓటర్లకు అవగాహన కల్పించాలని సూచించారు. కేసీఆర్ మళ్లీ రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నందున పార్టీ కార్యకర్తలు కూడా ఆ దిశగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ఎస్ఐఆర్ ద్వారా తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లోనూ ఎస్ఐఆర్ ద్వారా 90 లక్షల ఓట్లను తొలగించడంతో అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. అలాగే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. 2029 ఎన్నికల్లో రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగరేస్తామని తేల్చిచెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బీఆర్ఎస్ గెలుపును ఆపలేరని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. కొణిజర్ల మండలం తుమ్మలపల్లిలో చేస్తున్న అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఒప్పుకోబోమని స్పష్టం చేశారు. సిరిపురంలో ఎమ్మెల్యే బెదిరింపులకు తలవంచకుండా సర్పంచ్ స్థానం దక్కించుకున్నామని గుర్తుచేశారు.