– నల్లగొండ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జివి రమేశ్
గుర్రంపోడ్, ఆగస్టు 12 : గొర్రెలలో వచ్చే నీలి నాలుక వ్యాధి గురించి రైతులు అప్రమత్తంగా ఉండాలని నల్లగొండ జిల్లా పశువైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జివి రమేశ్ అన్నారు. బుధవారం గుర్రంపోడ్ మండలంలోని కొప్పొల్ గ్రామంలో ఏర్పాటు చేసిన జీవాలకు నీలి నాలుక వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేసి మాట్లాడారు. సరైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే గొర్రెల కాపరులు ఈ వ్యాధి నుండి మందలను కాపాడుకోవచ్చన్నారు. ఈ నీలి నాలుక వ్యాధి గొర్రెలలో వచ్చే వైరస్ వ్యాదని, ఇది ప్రధానంగా కులికోయిడ్స్ అనే దోమ కాటు ద్వారా వ్యాపిస్తుందని, వర్షాకాలంలో, తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వ్యాధి వ్యాప్తికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు. ఈ వ్యాది ప్రధాన లక్షణాలు అకస్మాత్తుగా జ్వరం రావడం, మేత తీసుకోవడం తగ్గడం లేదా పూర్తిగా మానేయడం, పెదవులు, నాలుక, ముఖం వద్ద వాపు, నోటి నుండి అధికంగా లాలాజలం కారడం, నాలుక నీలం లేదా ముదురు ఊదా రంగులోకి మారడం, నోటి లోపల, పెదవులపై పుండ్లు ఏర్పడడం, ముక్కు నుంచి స్రావం రావడం, కుంటడం, నడవడానికి ఇబ్బంది పడడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, బలహీనత, నీరసం తీవ్రమైన సందర్భాల్లో గొర్రెలు మృత్యువాత పడే అవకాశం ఉంటుందన్నారు. చూలు గొర్రెలలో గర్భస్రావం లేదా పిల్లల్లో అభివృద్ధి లోపాలు సంభవించవచ్చన్నారు.
గొర్రెలను సాయంత్రం నుంచి ఉదయం వరకు కులికోయిడ్స్ కీటకాల కాటు నుంచి రక్షించేలా గాలికి బాగా వచ్చే, పొడి ప్రదేశాల్లో ఉంచాలి. గొర్రెల కొట్టాలను పరిశుభ్రంగా ఉంచి, తేమ మరియు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. పశువుల పరిసరాల్లో కీటకాల నియంత్రణకు పశువైద్యుల సూచనల మేరకు అనుమతించబడిన కీటక నివారణ మందులను ఉపయోగించాలన్నారు. అనారోగ్యంగా ఉన్న గొర్రెలను మిగిలిన మంద నుంచి వేరు చేసి ఉంచాలని.కొత్తగా కొనుగోలు చేసిన గొర్రెలను వెంటనే మందలో కలపకుండా కొంతకాలం ప్రత్యేకంగా ఉంచి పశువైద్యుల ద్వారా పరీక్ష చేయించాలని అన్నారు. వ్యాధి అనుమానం ఉన్న ప్రాంతాల నుంచి గొర్రెలను ఇతర ప్రాంతాలకు తరలించకుండా సంబంధిత పశువైద్య అధికారులకు సమాచారం ఇవ్వాలని అన్నారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల సమయంలో గొర్రెల షెడ్లలో వేపాకు పొగ పెట్టాలి దాని ద్వారా దోమలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అన్నారు. ప్రతి సంవత్సరం జూలై, ఆగస్టు నెలలో పశుసంవర్ధక శాఖ ద్వారా అన్ని గ్రామాలలో ఉచితంగా టీకాలు వేయబడతాయి కాబట్టి రైతులు వారి గొర్రెలు అన్నింటికీ టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నాగయ్య, శ్రీజ, లైవ్ స్టాక్ అసిస్టెంట్ మాచర్ల శ్రావ్య, కవిత, అనిత పాల్గొన్నారు.