ఖమ్మం ఎడ్యుకేషన్, సెప్టెంబర్ 8 : ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో సదరు ఉపాధ్యాయులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌తోపాటు నాలుగు సెట్లను సంబంధిత డీడీవోల ద్వారా డీఈవో కార్యాలయంలో అందజేశారు. వీటిని పరిశీలించే పనిలో విద్యాశాఖాధికారులు నిమగ్నమయ్యారు. ఇందుకోసం సీనియర్ హెచ్‌ఎంలతోపాటు 10 మంది కార్యాలయ సిబ్బందిని బృందంగా నియమించారు. దరఖాస్తులతోపాటు అందజేసిన ధ్రువపత్రాలను నిజనిర్ధారణ చేస్తున్నారు.
ప్రమోషన్స్ ప్రొవిజనల్ జాబితా విడుదల
ఈ ఏడాది జనవరిలో హెచ్ఎంలు, స్కూల్ అసిస్టెంట్లు ఉద్యోగోన్నతి పొందేందుకు అర్హ్హులైన జాబితాను గుర్తించారు. దీంతోపాటు ఒరిజినల్ సర్టిఫికెట్లు, సర్వీస్ రికార్డులను పరిశీలించారు. వీటి ఆధారంగా హెచ్ఎంలుగా అర్హులైన వారి ప్రొవిజనల్ జాబితాను వరంగల్ ఆర్జేడీ విడుదల చేయగా.. స్కూల్ అసిస్టెంట్లుగా అర్హులైన వారి జాబితాను సబ్జెక్టులవారీగా శుక్రవారం డీఈవో వెబ్‌సైట్‌తోపాటు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూప్‌లకు చేరవేశారు. శని, ఆదివారం అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఉద్యోగోన్నతులకు లోకల్ బాడీ పరిధిలో ఎస్ఏ గణితం, ఫిజికల్ సైన్స్‌లో జనరల్‌లో 2000 సంవత్సరం, ఎస్సీకి 2008, ఎస్టీకి 2005 సంవత్సరం ఉన్నవారిని ఎంపిక చేశారు. బయాలాజికల్ సైన్స్, ఇంగ్ల్లిష్, సోషల్‌కి జనరల్ అండ్ ఎస్సీ 1998 అక్టోబర్ 26, ఎస్టీకి బయాలాజికల్ సైన్స్ అండ్ సోషల్ 2005, ఎస్టీకి ఇంగ్లిష్‌కి 2002 అక్టోబర్ 17 ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు. ఎల్ఎఫ్ఎల్కి జనరల్ అండ్ ఎస్టీకి 1998 సెప్టెంబర్ ఉన్న వారిని ఎంపిక చేస్తున్నారు.
దరఖాస్తుల వెల్లువ
ఉపాధ్యాయుల బదిలీకి జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాకు 4,722, నల్లగొండ 4,416, నిజామాబాద్ 4,088, సంగారెడ్డి జిల్లాకు 4,038 దరఖాస్తులు వచ్చాయి. తర్వాత అత్యధికంగా దరఖాస్తులు చేసుకున్నది ఖమ్మం జిల్లాలోనే. మొత్తం దరఖాస్తులు 3,876 రాగా.. 3,720 దరఖాస్తులను డీఈవో అప్రూవల్ చేయగా.. 97 పెండింగ్‌లో ఉంచారు. 59 దరఖాస్తులను తిరస్కరించారు. బదిలీకి కనీసం రెండేళ్ల సర్వీస్ చేసిన వారు అని పేన్కొనగా.. 59 మంది దీనికి విరుద్ధంగా దరఖాస్తు చేయడంతో వాటిని తిరస్కరించారు. 97 దరఖాస్తులకు సంబంధించిన హార్డ్‌కాపీలు డీఈవో కార్యాలయంలో సబ్మిట్ చేయనందున వాటిని పెండింగ్‌లో పెట్టారు.
నేటి నుంచి మెడికల్ సర్టిఫికెట్ల పరిశీలన…
టీచర్లకు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్లను శనివారం నుంచి పరిశీలన చేయనున్నారు. ఇందుకోసం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో 10 మంది డాక్టర్లతో కూడిన బృందాన్ని కలెక్టర్ ఆదేశాల మేరకు నియమించారు. బృందంలో అన్ని స్పెషలైజేషన్లకు సంబంధించిన వైద్యులు ఉంటారు. ఉపాధ్యాయులు దరఖాస్తుల్లో పేర్కొన్న మెడికల్ రిపోర్ట్స్‌ను విద్యాశాఖ సిబ్బంది పరిశీలించే విధంగా డీఈవో సోమశేఖర శర్మ ఆదేశాలు జారీ చేశారు. వీటితోపాటు కార్యాలయంలో ప్రిఫరెన్షియల్ కేటగిరీ దరఖాస్తులను గుర్తించే ప్రక్రియపై కసరత్తు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి ప్రిఫరెన్షియల్ కేటగిరీ దరఖాస్తులను వెల్లడించనున్నారు. వీటిలో గతంలో స్పౌజ్ వాడుకున్న వారు, నిబంధనలకు అనుకూలంగా ఉన్నవి, విరుద్ధంగా ఉన్న వాటిని గుర్తించే పనిలో ఉన్నారు.
974 ఖాళీలు…
జిల్లాలో 974 ఖాళీలు ఉన్నట్లు విద్యాశాఖాధికారులు ప్రకటించారు. వీటితోపాటు తప్పనిసరి బదిలీల్లో ఐదేళ్లు పూర్తైన హెచ్ఎంలు, ఎనిమిదేళ్లు పూర్తైన వివిధ కేటగిరీలకు చెందిన ఉపాధ్యాయులు కలిపి 1,617 మంది ఉన్నారు. ఇవన్నీ కలిపి 2,591 ఖాళీలు ఉన్నాయి. సబ్జెక్టులవారీగా లోకల్ బాడీ, ప్రభుత్వ పాఠశాలలవారీగా ఖాళీల వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ఈ షెడ్యూల్లో దరఖాస్తు చేసిన వారు : 288 మంది
గత షెడ్యూల్లో దరఖాస్తు చేసి ఎడిట్ చేసిన వారు : 3,387 మంది
గత షెడ్యూల్లో దరఖాస్తు చేసి ఎడిట్ చేయని వారు : 201 మంది