గ్రామసభలు ఆసాంతం ఘర్షణల సభలయ్యాయి. ఆ ఊరు, ఈ ఊరు అనే తేడా లేకుండా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని ఊళ్లూ అట్టుడికి పోయాయి. పథకాలకు జరిగిన ఎంపికలో అనర్హులకు, సంపన్నులకు అగ్రతాంబూలం వేసినట్లుగా జాబితా ఉండడంతో, అసలైన నిరుపేదల పేర్లు మచ్చుకైనా లేకపోవడం వంటి కారణాలతో అర్హులైన పేదలు ఆగ్రహంతో రగిలిపోయాయి. అన్ని మండలాల్లో గురువారం మూడో రోజు జరిగిన గ్రామసభలూ నిరసనలు, నిలదీతలతోనే కొనసాగాయి. ఆరు గ్యారెంటీలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలివ్వడం, ప్రజాపాలన పేరిట ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించడం వంటి కారణాలతో ఇక తమకు పథకాలు కచ్చితంగా వస్తాయన్న ఆశతో ప్రజలందరూ గ్రామసభలకు పోటెత్తారు. కానీ.. అక్కడ అధికారులు జాబితాలో చదువుతున్న పేర్లను గమనించిన పేదలకు అసలు విషయం అర్థమైంది. జాబితా మొత్తంలో పట్టుమని పదిమంది కూడా అర్హులు లేకపోవడం, జాబితాలోని మొదటి వరుస పేర్లన్నీ సంపన్నులవే ఉండడం వంటి కారణాలతో పేదలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఆశలు ఆవిరయ్యాయని నిర్ధారించుకొని ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అర్హులకు పథకాలు అందించని గ్రామసభలు ఎందుకంటూ అడుగడుగునా
అడ్డుకున్నారు.
-ఖమ్మం, నమస్తే తెలంగాణ ప్రతినిధి/భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, జనవరి 23
ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులను ఎంపిక చేశామని, వారందరికీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26 నుంచి వాటి ఫలాలు అందిస్తామని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. అర్హులు, లబ్ధిదారుల జాబితాలను ప్రజల ముందుంచేందుకు ఈ నెల 21 నుంచి గ్రామసభలు నిర్వహిస్తున్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరుగుతున్న గ్రామసభలపై మొదటి రోజు నుంచే ప్రజల్లో నిరసనలు వ్యక్తమయ్యాయి. జాబితాల తొలి భాగంలోనే ఆస్తిపరులు, అనర్హుల పేర్లు రావడం, ఆఖరి భాగంలోనూ పెద్దగా అర్హులు పేర్లు లేకపోవడం, గూడు కోసం ఎదురుచూసిన వారికి ఇందిరమ్మ ఇళ్లు రాకపోవడం, చివరికి రేషన్‌కార్డులూ రాకపోవడం వంటి పరిణామాలు ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి. ప్రజాపాలన పేరిట ప్రభుత్వం తమను వంచించిందంటూ ప్రజలు మండిపడ్డారు. తాము నిరుపేదలమైనా, తమకు అన్ని అర్హతలు ఉన్నా, ఇప్పటికే ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఆయా పథకాలను తమదాకా రానివ్వడం లేదంటూ అనేకమంది మహిళలు అధికారుల ఎదుటే కంటతడి పెట్టుకున్నారు. అక్కడే వేదికలపై ఉన్న కాంగ్రెస్ నేతలు కనీస కనికరం చూపకుండా తమ కార్యకర్తల కోసమే పథకాల పందేరం వేశారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన నిరుపేదలు.. సుజాతనగర్, సింగభూపాలెం, ఖమ్మం రూరల్ ప్రాంతాల్లో అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులపై తిరుగుబాటు చేశారు. ములకలపల్లి గ్రామసభలో బైఠాయించి నిరసన తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు ఇంకెప్పుడిస్తారంటూ నిలదీశారు. భద్రాద్రి జిల్లా సుజాతనగర్లో ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అధికారులు గ్రామసభను రద్దుచేసుకొని వెళ్లిపోయారు.
జీపీ గేటుకు తాళం.. లోపల గ్రామసభ..
భద్రాచలం గ్రామసభ తీరుపై పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 80 వేలమందికి పైగా జనాభా ఉన్న భద్రాచలం గ్రామసభను గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో అక్కడ స్థలం సరిపోలేదు. దీంతో పంచాయతీ అధికారులు తమ కార్యాలయ గేటుకు తాళం వేశారు. దీంతో మిగిలిన వారంతా గంటల తరబడి ఎండలో గేటుబయటే ఉండిపోయారు. జాబితాలో తమ పేరు ఉందో లేదో, పథకాలు తమకు వచ్చాయో రాలేదో తెలియక ఆవేదనకు గురయ్యారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఈ గ్రామసభలో పాల్గొనేందుకు జీపీ వద్దకు వచ్చేటప్పటికే దాని గేటుకు తాళం వేసి ఉంది. వేలాదిమంది గ్రామస్తులు బయట నిరీక్షిస్తున్నారు. దీంతో పంచాయతీ ఈవోకు ఎమ్మెల్యే ఫోన్ చేయడంతో ఆయన సిబ్బందిని పంపారు. సిబ్బంది వచ్చి తాళం తీయడంతో ఎమ్మెల్యే లోనికి వెళ్లారు. సిబ్బంది వెంటనే ఆ గేటుకు తాళం వేశారు. గ్రామసభలో కూడా సరిపడినన్ని కుర్చీలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటుచేయకపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో ఐటీడీఏ పీవో రాహుల్ కూడా సభ ప్రారంభమైన కొద్దిసేపటికే వెళ్లిపోయారు. జాబితాలో పేర్లు రానివారందరూ మళ్లీ దరఖాస్తు చేసుకోవాలంటూ అధికారులు చెప్పడంతో వారంతా జిరాక్స్ సెంటర్లకు పరుగులు పెట్టారు. కాగా, గ్రామసభలో అధికారుల తీరును బీఆర్ఎస్ నాయకులు నిరసించారు. సర్వేలు, సభలతో కాలయాపన చేయకుండా అర్హులందరికీ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
గ్రామసభ విధులు.. కార్మికుడికి ఫిట్స్..
పాల్వంచ గ్రామసభ సందర్భంగా ఉదయం నుంచి విధుల్లో ఉన్న మున్సిపల్ తాత్కాలిక కార్మికుడు లక్ష్మణ్ మధ్యాహ్నం ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. గ్రామసభకు వచ్చిన ప్రజలు గమనించి పరిశీలించారు. ఫిట్స్ వచ్చి కిందపడిపోయినట్లు భావించారు. వెంటనే అప్రమత్తమై ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సిబ్బందిని పిలిపించి చూపించారు. తాత్కాలికంగా వైద్య సేవలు చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఉన్నతాధికారి తండ్రికి రేషన్ కార్డు ఇస్తారు.. మరి పేదలకు ఇవ్వరా?
ఆర్డీవో స్థాయి అధికారి తండ్రికి రేషన్ కార్డు మంజూరు చేస్తున్న అధికారులు.. నిరుపేదలకు ఎందుకు ఇవ్వడం లేదంటూ కేఎంసీ 53వ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య అధికారులను ప్రశ్నించారు. ఖమ్మంలోని తన డివిజన్లోని గ్రామసభలో పాల్గొన్న ఆమె.. స్థితిమంతుల పేర్లు పథకాలు జాబితాలో ఉండడాన్ని, నిరుపేదల పేదల పేర్లు లేకపోవడాన్ని గమనించారు. అప్పటికే అర్హులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో ఆమె కూడా వారికి మద్దతుగా నిలిచారు. ఇళ్లలో పాచిపనులు చేసుకొని బతికేవాళ్లకు, ఇస్త్రీ చేసుకొని జీవించే వాళ్లకు రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుండా.. నెలకు రూ.లక్షల్లో పెన్షన్లు, అద్దెలు తీసుకునే వాళ్లకు, ఎకరాల కొద్దీ భూములున్న వాళ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. డివిజన్లో 600 మంది పేదలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే కేవలం 112 మందికి మాత్రమే మంజూరు చేయడం ఏమిటంటూ నిలదీశారు.
జీపీ ఎదుట పేదల బైఠాయింపు.. మహిళా కార్యదర్శి కంటతడి..
అశ్వారావుపేట నియోజకవర్గంలోని గ్రామసభలు రసాభాసగా మారాయి. ధనవంతులు, కాంగ్రెస్ సానుభూతిపరులు, బంధువులు, స్నేహితులకే పథకాలు కేటాయించారని, అసలైన నిరుపేదలకు తీవ్ర అన్యాయం చేశారని నిరుపేదలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హులను ఎందుకు ఎంపిక చేశారంటూ ప్రజలు ఒక్కసారిగా నిలదీయడంతో మహిళా కార్యదర్శి మహేశ్వరి కంటతడి పెట్టుకున్నారు. అక్కడే ఉన్న ఎస్సై శ్రీరామ్మూర్తి చొరవతీసుకొని ఆందోళనకారులకు సర్దిచెప్పడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. ములకలపల్లి మండలంలో లబ్ధిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ గ్రామస్తులు ఆరోపించారు. సర్వేలో అధికారులు వైఫల్యం చెందారంటూ గ్రామసభను బాయ్‌కాట్ చేశారు. గ్రామసభ ఎదుట బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇందిరమ్మ ఇళ్లు రావడంలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాపాలన పేరిట బురిడీ.. మహిళల కన్నీరుమున్నీరు..
ప్రజాపాలన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తమను బురిడీ కొట్టించిందని, ఆఖరికి పథకాలు ఇవ్వకుండా అన్యాయం చేసిందని బోనకల్లు మండల మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభల్లో అధికారులు తొలుత అర్హుల జాబితా అంటూ అనర్హుల పేర్లు చదవడంతో ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు. ‘మరి మేము అర్హులం కాదా?’ అంటూ నిలదీశారు. జాబితాను పరిశీలించిన బీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం నాయకులు.. గ్రామసభలోనే పరస్ఫరం వాగ్వాదానికి దిగారు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో వారిపై మండిపడ్డారు. మరోసారి దరఖాస్తు చేసుకోవడమేంటని ప్రశ్నించారు. కాగా, తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని అధికారులు చెప్పడంతో మందపల్లి సుజాత అనే మహిళ గ్రామసభలో అధికారుల ముందే కన్నీరుమున్నీరుగా విలపించింది. బోనకల్లు గ్రామసభలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది.
రేషన్ కార్డు జాబితాలో పేరు లేదు..
రేషన్ కార్డు కోసం మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ప్రస్తుత గ్రామసభలో అధికారులు ప్రకటించిన జాబితాలో నా పేరు రాలేదు. అన్ని అర్హతలున్నా నాకు కార్డు ఎందుకు మంజూరు కాలేదో అర్థం కావడం లేదు. ఎలాంటి అర్హతలు లేని వారికి రేషన్ కార్డు జాబితాలో పేర్లు వచ్చాయి. అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పి చేతులు దులుపుకున్నారు.
-దామెర్ల ప్రశాంత్, రైతు కూలీ, డబ్ల్యూ రేగుబల్లి, దుమ్ముగూడెం మండలం
ఆన్లైన్ చేసుకున్నా కార్డు రాలే..
రేషన్ కార్డు కోసం నేను చాలా సార్లు ఆన్లైన్ చేసుకున్నా. అయితే ప్రజా పాలనలో కూడా అధికారులకు దరఖాస్తు అందజేశాను. కానీ.. జాబితాలో మాత్రం నా పేరు రాలేదు. అధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఈసారైనా జాబితాలో పేరు వస్తుందో.. లేదో.. అనే అనుమానం ఉంది.
-భూక్యా వినోద్, రుద్రంపూర్ తండా
ఇంటి జాబితాలో పేరు రాలేదు..
ప్రజాపాలనలో భాగంగా ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా. పంచాయతీ కార్యదర్శి వచ్చి ఫొటో తీసుకొని వెళ్లాడు. అయితే గ్రామసభలో వచ్చిన జాబితాలో చూస్తే నా పేరు రాలేదు. ఒక్కో కుటుంబంలో ఇద్దరు ముగ్గురి పేర్లు వచ్చాయి. కానీ.. నా పేరు రాలేదు. ఏమైందో అర్థం కావడం లేదు.
-భూక్యా రవి, రుద్రంపూర్ తండా
రేషన్ కార్డు మంజూరు కాలేదు..
రేషన్ కార్డు కోసం ప్రజా పాలనలో అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా.. మంజూరు కాలేదు. నా భర్త బట్టల దుకాణంలో గమస్తాగా పని చేస్తున్నాడు. కార్డు లేకపోవడంతో అనేక విధాలుగా నష్టపోతున్నాం. అన్ని అర్హతలుగా రేషన్ కార్డు జాబితాలో నా పేరు లేదు. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం సమంజసం కాదు.
-చింతల రాజ్యలక్ష్మి, మధిర
అంధుడినైనా ఏ పథకం రాలేదు..
నేను అంధుడిని. ఇల్లు, నా భార్యకు ఆత్మీయ భరోసా కోసం దరఖాస్తు చేసుకున్నా. కానీ పథకమూ రాలేదు. ఉండటానికి ఇల్లు లేదు. ఇంటికి చేసుకున్నా దు. దివ్యాంగులకు ప్రత్యేక కోటా కింద ఇల్లు ఇవ్వాల్సి ఉన్నా నా పేరు ప్రకటించలేదు. అధికారులను అడిగితే జాబితా పైనుంచి వచ్చిందని అంటున్నారు.
-నెర్సుల వీరబాబు, చిరుమర్రి