రఘునాథపాలెం, మార్చి 13: దేశంలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఖమ్మం గ్యాస్ ఏజెన్సీల్లో మాత్రం బ్లాక్ దందా యథేచ్ఛగా నడుస్తోంది. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఏజెన్సీ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గల్ఫ్ యుద్ధాలను సాకుగా చేసుకొని పలు కంపెనీలు గ్యాస్ కొరత పేరుతో బ్లాక్ దందా నడిపిస్తున్నారు. ఓ పక్క అధికారులు జిల్లాలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని చెబుతున్నా.. ఏజెన్సీలు మాత్రం గ్యాస్ సిలిండర్ కోసం వెళితే స్టాక్ లేదంటూ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఈ క్రమంలో మధ్యవర్తులను ఆశ్రయిస్తే మాత్రం అధిక ధరలకు సిలిండర్లను అందజేస్తున్నారు. దీంతో తమ చేతికి మట్టి అంటొద్దనే ఉద్దేశంతో కొన్ని గ్యాస్ ఏజెన్సీలో మధ్యవర్తుల ద్వారా గ్యాస్ సిలిండర్లను బ్లాక్‌లో అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్ గోడౌన్ల వద్ద ఫుల్ సిలిండర్ల కోసం వినియోగదారులు గంటల కొద్దీ వేచి చూసినా గ్యాస్ దొరకని పరిస్థితి నెలకొంది. అయితే గ్యాస్ ఏజెన్సీల బ్లాక్ దందాపై దృష్టి సారించాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాక వినియోగదారులు ఆన్లైన్లో బుక్ చేసుకున్న గ్యాస్‌ను సైతం ముందుగానే ఇతరులకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
గ్యాస్ సిలిండర్ కావాలని శుక్రవారం ఉదయం 2వ డివిజన్లో ఉన్న శ్రీబాలాజీ గ్యాస్ కంపెనీకి వెళ్లాను. అప్పుడు ఏజెన్సీలో గ్యాస్ స్టాక్ లేకపోవడంతో అక్కడే ఉన్న ఓ మధ్యవర్తి రూ.1,800కు గ్యాస్ సిలిండర్ ఇస్తానని చెప్పాడు. దీంతో సదరు మధ్యవర్తిని బతిమలాడి చివరికి రూ.1,500లకు సిలిండర్ కొనుగోలు చేశాను. ఇంతటి దోపిడీ ఎక్కడా చూడలేదని వాపోయాడు.
-చావా హరికృష్ణ, గ్యాస్ వినియోగదారుడు, బల్లేపల్లి