ఖమ్మం అర్బన్, జూన్ 9: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను వెతికివెతికి మరీ తమ పాఠశాలల్లో చేర్చుకుంటున్నాయి. అందుకోసం ప్రత్యేక బృందాలను నియమించి జల్లెడ పడుతున్నాయి. తమ పాఠశాలల్లో అందిస్తున్న విద్యను వివరిస్తూ.. రాయితీల వల విసురుతూ చిన్నారుల తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. కానీ, సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అవససరమైన పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంలో జిల్లా విద్యాశాఖ విఫలమైంది. బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కొందరు ఉపాధ్యాయులు మాత్రమే పాల్గొంటుండడంతో పెద్దగా ప్రభావం చూపని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై పెను ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
జిల్లాలో 21 మండలాల్లో రఘునాథపాలెం, ఖమ్మం రూరల్ మండలాలకు మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. మిగిలిన 19 మంది ఆయా మండలాల్లోని ఉన్నత పాఠశాలల్లో సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఇన్చార్జి ఎంఈవోలుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో వారికి పనిభారం ఎక్కువైంది. ఇటీవల బడిబాట విజయవంతం చేయాలని ఎంఈవోలకు సుమారు 5 గంటలపాటు డీఈవో దిశానిర్దేశం చేశారు. కానీ, క్షేత్రస్థాయిలో ఎంఈవోలు ప్రీ ప్రైమరీ స్కూళ్లు, ఉపాధ్యాయుల సర్దుబాటు, బెంచీల వంటి మౌలిక సదుపాయాల గుర్తింపు, వారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసే పాఠశాల విధుల్లో భాగస్వామ్యం కావడం వంటి అంశాలతో తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. తిరుమలాయపాలెం మండలంలో గతంలో ఉన్న ఎంఈవోను మార్చి మరొకరిని ఎంఈవోగా నియమించగా తనకు ఆ బాధ్యతలు వద్దని చెప్పడంతో పాత వారినే కొనసాగిస్తున్నారు. మధిర నియోజకవర్గంలోని ఓ రెండు మండలాల ఎంఈవోల విషయంలో విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్నారని వారిని తొలగించి వేరే వారిని నియమించాలని అదనపు కలెక్టర్ ఆదేశించినా.. ఇతరులు ముందుకు రాకపోవడంతో వారినే కొనసాగిస్తున్నారు. వీరితోపాటు సత్తుపల్లి నియోజకవర్గంలో ఓ రెండు మండలాలకు చెందిన ఇద్దరు ఎంఈవోలు తమను ఇన్చార్జి ఎంఈవోల డ్యూటీ నుంచి తొలగించాలని గతంలో లిఖిత పూర్వకంగా విన్నవించారు. ఇలా పలువురు ఎంఈవోలు, ఇన్చార్జి ఎంఈవోలు త్రీవ ఒత్తిడితో కూడిన డ్యూటీ పట్ల అనాసక్తిని కనబరుస్తున్నారు.
ఈ నెల 3 నుంచి 12 దాకా బడిబాటను నిర్వహిస్తున్నారు. పది రోజుల బడిబాటలో 6 రోజులు ఇతర విధుల్లోనే ఉపాధ్యాయులున్నారు. పాఠశాల పరిధిలో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించి విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై అవగాహన కల్పించాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత ఏకరూప దుస్తులు, నాణ్యమైన విద్య వంటివి అందిస్తామని ఉపాధ్యాయులు హామీ ఇస్తూ విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేవారు. స్థానిక ప్రజాప్రతినిధులను, స్వచ్ఛంద సంస్థల బాధ్యులను ఇందులో భాగస్వామ్యం చేసేవారు. పాఠశాలలకు రంగులు వేయడం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడం, గదులకు మరమ్మతులు చేయడం వంటి కార్యక్రమాలన్నీ బడిబాట సందర్భంగా నిర్వహించేవారు. కానీ, ఈ ఏడాది సగానికిపైగా పాఠశాలల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించిన జాడే కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి, ఆరు తరగతుల విద్యార్థుల చేరికలు కీలకం. అలాగే, గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి 9 తరగతులు చదివిన విద్యార్థులంతా తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉండే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉంటుందోనన్న ఆందోళన కనిపిస్తోంది.