ఖమ్మం అర్బన్, నవంబర్ 3: కాంగ్రెస్ సర్కారుపై ప్రైవేట్ కళాశాలలు సమరం శంఖం పూరించాయి. విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం పట్టించుకోనూ లేదు. దీంతో ప్రైవేటు కళాశాలలు తమ కార్యాచరణను ప్రారంభించాయి. దీనిలో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంజినీరింగ్, డిగ్రీ సహా ఇతర వృత్తి విద్యా కళాశాలల గేట్లు కూడా తెరుచుకోలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేంత వరకు ప్రైవేట్ కళాశాలలు నిరవధిక బంద్ కొనసాగుతుందని ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు తమ కళాశాలల గేట్లకు తాళాలు వేసి తమ నిరసన తెలిపాయి. నిరవధిక బంద్ పాటిస్తున్నందున ఎవ్వరూ కళాశాలలకు రావొద్దంటూ విద్యార్థులకు, అధ్యాపకులకు ముందుగానే సమాచారం ఇచ్చాయి.
ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలు మినహా మిగిలిన అన్ని రకాల కోర్సులు అందించే ప్రైవేట్ కళాశాలలన్నీ నిరవధిక బంద్‌లో పాల్గొంటున్నాయి. విడతల వారీగానైనా ఫీజు బకాయిలు చెల్లించాలంటూ ప్రైవేటు కళశాలల యాజమాన్యాలు రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాయి. ఇన్నాళ్లూ సంప్రదింపులు జరుపుతూ, గడువులు విధిస్తూ కాలయాపన చేయించిన రేవంత్ సర్కారు.. తరువాత స్పందించడమే మానేసింది. దీంతో ఫీజు బకాయిలు విడుదల చేసే వరకూ తాము నిరవధిక బంద్ పాటిస్తామని కళాశాలల యాజమాన్యాలు అల్టిమేటం జారీ చేశాయి. సోమవారం నుంచి బంద్‌ను కూడా ప్రారంభించాయి. అయినా చోద్యం చూస్తోందే తప్ప బకాయిల విడుదలకు చర్యలు చేపట్టడం లేదు. ఇది ఇంకా కొన్ని రోజులు కొనసాగితే విద్యార్థుల చదువులు, పరీక్షలపై ప్రభావం పడే ప్రమాదముంది.
ప్రభుత్వం నుంచి రూ.కోట్ల బకాయిలు రావాల్సి ఉండడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లోనే కళాశాలలను బంద్ చేస్తున్నామని యాజమాన్యాలు బహిరంగంగా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తున్నాయి. ఇన్ని రోజులూ ప్రభుత్వ పెద్దలను కలవడం, అడపాదడపా నిరసనలు తెలపడం వంటి కార్యాచరణను మాత్రమే పాటించిన ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు.. ఇప్పుడు ప్రత్యక్షంగా రంగంలోకి దిగాయి. సోమవారం నుంచి నిరవధిక బంద్ పాటిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో కళాశాలలను నిరవధిక బంద్ చేస్తున్నామని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కళాశాలల బాధ్యులు మెసేజ్‌లు పంపాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేంత వరకు పోరాటం ఆగదని, బంద్ కొనసాగుతుందని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.