అశ్వారావుపేట: తెలంగాణ రాష్ట్రంలోని ఆయిల్ఫామ్ రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యాపార విస్తరతో సంస్థ ఆదాయం పెంచుకునేందుకు దృష్టిసారించినట్లు ఆయన తెలిపారు. మండలంలోని నారంవారిగూడెం ఆయిల్ ఫామ్ నర్సరీలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావుతో కలసి రైతులకు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం రైతులతో సమావేశమై పలు సమస్యలపై చర్చించారు. రైతుల సందేహాలకు సమాధానం ఇస్తూ భవిష్యత్తులో టన్ను ఆయిల్ ఫామ్ గెలల ధర రూ.20 వేలు వరకు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
రానున్న రోజులలో ఆయిల్ ఫామ్ రైతులకు మంచి జరుగుతుందని అన్నారు. ఇప్పటికీ చైర్మన్‌గా ఆయిల్ ఫెడ్ సంస్థలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు వివరించారు. దేశవ్యాప్తంగా అంతర్జాతీయ మార్కెట్లో వంటనూనెకు డిమాండ్ దృష్ట్యి తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగు విస్తరణ సియం కేసీఆర్ దృష్టి సారించారిన సాగు విస్తరణ బాధ్యతను టిఎస్ ఆయిల్ ఫెడ్ తో పాటు మరికొన్ని ప్రవేటు కంపెనీలకు అప్పగిస్తూ కేటాయింపులు చేసిందని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఆయిల్ ఫెడ్ సాగు ప్రోత్సాహానికి రూ. 11040 కోట్లు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రైవేటు కంపెనీల పెత్తనం ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నామని ఇప్పటికే ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేటు కంపెనీలు అక్కడి ఆయిల్ ఫామ్‌ను తొక్కెశాయని ఆ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలోకి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. సంస్థలో ఏమైనా సమస్యలు ఉంటే వాటి పరిష్కారానికి రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆయిల్ ఫామ్ సాగుకు కేసీఆర్ ప్రోత్సాహం: ఎమ్మెల్యే మెచ్చా
తెలంగాణరాష్ట్రంలో ఆయిల్ ఫెడ్ సాగును ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అన్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ హబ్‌గా రూపుదిద్దుకుంటుందని, పచ్చని తెలంగాణ నిర్మాణానికి ఆయిల్ ఫామ్ సాగు దోహదపడుతుందని ఆయన అన్నారు. అశ్వారావుపేట నియోకవర్గంలో ఆయిల్ ఫామ్ సాగు ప్రాధాన్యతపై సీఎం కేసీఆర్ కితాబు ఇచ్చారని, ప్రభుత్వం అందిస్తున్న రాయితీలతో పథకాలను సద్వినియోగం చేసుకుని రైతులు ఆయిల్ ఫామ్ సాగు విస్తరణకు తోడ్పాటు అందివ్వాలని సూచించారు.