భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ) : కలెక్టరేట్లో ప్రజావాణి జరుగుతున్నదంటే పెద్ద సారు ఉంటారని అధికారులకు ఒక భయం. ఇలాంటి సమయంలో ప్రజా సమస్యలకు కొంతవరకైనా న్యాయం జరుగుతుందని దరఖాస్తుదారుల నమ్మకం. కానీ గత రెండునెలలుగా కొత్తగూడెంలోని ఐడీవోసీ కార్యాలయంలో ప్రజావాణి జరగడం లేదు. దీంతో ప్రజా సమస్యలు పరిష్కారంకాక ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. దరఖాస్తుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం జరిగిన చాలా ప్రజావాణిలకు ఉన్నతాధికారులు హాజరుకాకపోవడంతో సమస్యలు అంతంతమాత్రమే పరిస్కారం అయ్యాయని జోరుగా ప్రచారం సాగింది.
గత రెండునెలలు భద్రాచలాన్ని వరదలు పట్టిపీడించాయి. ఇప్పటికీ మూడు సార్లు రెండో ప్రమాద హెచ్చరికలు దాటి గోదావరి ప్రవహించింది. దీంతో అధికారులు హడావుడిగా భద్రాచలం వెళ్లడం రెండురోజుల్లో తిరిగిరావడం జరిగింది. ఇప్పుడేమో స్థానిక సంస్థల ఎన్నికల హడావుడితో సమయానికి అధికారులు ఉండక ప్రజావాణిని రద్దు చేస్తూ వస్తున్నారు. గత రెండు నెలల నుంచి కలెక్టరేట్లో ప్రజావాణి జరగడం లేదు. సమయాన్ని బట్టి భూసమస్యల పరిష్కారం కోసం భద్రాచలం, కొత్తగూడెం ఆర్డీవో కార్యాలయాల్లో జరపాలని కలెక్టర్ ఆదేశించినా ఆశించిన ఫలితం రావడం లేదు. కలెక్టరేట్లో ప్రజావాణి ఉంటేనే ఫిర్యాదులు ఇస్తామని కొంతమంది బాధితులు ఆర్డీవో కార్యాలయాలకు వెళ్లడం లేదు. దీంతో ఆర్డీవో కార్యాలయాల్లో జరిగే ప్రజావాణికి ఆదరణ చాలా తక్కువగానే ఉందనే చెప్పాలి. కలెక్టరేట్లోనే జిల్లా అధికారులు ఉండడం లేదు.. ఇక అక్కడకు ఎందుకు వస్తారని ప్రజలు కూడా ఫిర్యాదులు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు.
కొంతకాలంగా ఐడీవోసీలో ప్రజావాణి జరగడం లేదు. వరదలు, ఎన్నికల హడావుడి, ఇతర కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చాం. ఎక్కువగా భూ సమస్యలపైనే దరఖాస్తులు వస్తుండడంతో ఆర్డీవో కార్యాలయాల్లో అందజేయాలని ప్రజలకు సూచించాము. భద్రాచలం ఐటీడీఏలో సైతం ప్రజా దర్బార్ జరుగుతుంది. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదు. త్వరలోనే ఐడీవోసీలో కూడా ప్రజావాణి జరుగుతుంది. ఎక్కడ ప్రజావాణి జరిగినా అధికారులకు ప్రజలు తమ సమస్యలను దరఖాస్తుల రూపంలో అందజేయాలి.
– వేణుగోపాల్, అదనపు కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం