సత్తుపల్లి (తల్లాడ), నవంబర్13: పత్తి కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా జరగాలని ఖమ్మం పోలీసు కమిషనర్ సునీల్‌దత్ సూచించారు. తేమ శాతం పేరుతో రైతులకు ఇబ్బందులు తలెత్తనీయొద్దని అన్నారు. తల్లాడ మండలంలోని స్టాప్లెరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్ మిల్లులో ఏర్పాటుచేసిన సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పత్తి కొనుగోలు, రవాణా, బిల్లుల అంశాల గురించి రైతులతో నేరుగా మాట్లాడారు.
వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలని, రైతులకు భరోసా కల్పించాలని అధికారులకు సూచించారు. సీసీఐలో కొనసాగుతున్న ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా కొనసాగించాలన్నారు. ఏదైనా శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసు అధికారులు పాల్గొన్నారు.