సీఎం కేసీఆర్ విజన్‌తో రాష్ట్రం ‘ఆరోగ్య తెలంగాణ’ వైపు అడుగులు వేస్తున్నది.. ఒకప్పుడు గ్రామాలు, పట్టణాలలోని ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఏఎన్ఎంలు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్యసాయం అందించేవారు. నేడు అవే ఉపకేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం పల్లె దవాఖానలుగా అప్‌గ్రేడ్ చేసింది. ప్రతి ఆసుపత్రికి ఒక ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్)తో పాటు ఒక నర్స్, సిబ్బందిని నియమించింది. ఇక నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్యసేవల మాదిరిగానే పల్లె దవాఖానలోనూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. ఒకేచోట వైద్య పరీక్షలు, మెడిసిన్ పంపిణీ చేసే విధంగా దవాఖానలు అందుబాటులోకి రానున్నాయి. ఏ చిన్న వైద్యానికైనా వ్యయప్రయాసల కోర్చి పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులకు పరుగులు తీసిన మారుమూల ప్రాంతవాసులు ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
– ఖమ్మం సిటీ, మార్చి 12
భద్రాద్రి కొత్తగూడెం, నమస్తే తెలంగాణ/ ఖమ్మం సిటీ, మార్చి 12 : అది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల తడికలపూడి గ్రామం. అక్కడి ప్రజలకు వైద్యం అందాలంటే 9 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిందే. తీరా అక్కడికి వెళ్లాక డాక్టర్ టూర్ వెళ్లారని సిబ్బంది చెబితే ఆ రోజు పనంతా వృథాయే. పైగా అత్యవసర చికిత్స అయితే మళ్లీ ప్రయాస పడుతూ మరో ఆసుపత్రికి వెళ్లాలి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. గ్రామ స్థాయిలోనే సర్కారు వైద్యసేవలు అందించాలనే తలంపుతో ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చింది. ఆరోగ్య ఉప కేంద్రాల్లో పూర్తి స్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించడంతో గ్రామాలకూ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చేశాయి.
పల్లెకు చేరిన సర్కారు వైద్యం..
ఇప్పటి వరకు పట్టణాలకు అందుబాటులో అందుతున్న వైద్య సేవలను పల్లెలకూ విస్తరిస్తున్నాయి. నాడు ఆరోగ్య ఉప కేంద్రాల ద్వారా కేవలం ఏఎన్ఎంలు సేవలు అందించే వారు. నేడు అవే ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లె దవాఖానలుగా అప్‌గ్రేడ్ చేశారు. దీంతో అక్కడ ప్రత్యేక వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అక్కడ ఉన్న ఆసుపత్రిలో ఎంఎల్‌హెచ్‌పీ (మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్), నర్సు, సిబ్బందిని ఏర్పాటు చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వలే పల్లెదవాఖానలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సిబ్బంది గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తారు.
153 కేంద్రాలో ఎంఎల్‌హెచ్‌పీలు..
ఇప్పటి వరకు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 240 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నప్పటికీ వాటిల్లో 153 సబ్ సంటర్లను పల్లె దవాఖానలుగా అప్‌గ్రేడ్ చేశారు. వీటిలో ఏడుగురు ఎంబీబీఎస్ వైద్యులను నియమించగా మిగతా వారిని బీఎస్సీ నర్సింగ్, బీఏఎంఎస్ చేసిన వారిని వైద్యులుగా నియమించారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వైద్యం మరింత చేరువైనట్లయింది. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు దూరాభారం తగ్గింది. ఒక పీహెచ్సీ పరిధిలో 5 నుంచి పది పల్లె దవాఖానలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా ఏర్పాటుతో ఏరియా ఆసుపత్రిగా ఉన్న కొత్తగూడెం ఆసుపత్రి.. జిల్లా ఆసుపత్రిగా రూపాంతరం చెందింది. దీని పరిధిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రం ఏర్పాటైంది. 350 బెడ్లుగా జిల్లా ఆసుపత్రి అప్‌గ్రేడ్ అయింది. దీనికి అనుసంధానంగా మెడికల్ కాలేజీ రావడంతోపాటు రెసిడెంట్ వైద్యులు అందుబాటులోకి వచ్చారు.
ఖమ్మం జిల్లాలో 224 ఆరోగ్య ఉప కేంద్రాలు
పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో ఊరికో దవాఖానను ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఖమ్మంలో ప్రధాన వైద్యశాలను 500 బెడ్లకు మధిర, వైరా, సత్తుపల్లి దవాఖానాలను 100 బెడ్లకు అప్‌గ్రేడ్ చేసింది. నేలకొండపల్లి, పెనుబల్లి, తిరుమలాయపాలెం ఆసుపత్రులను 24 గంటలపాటు సేవలందించేలా మార్చింది. వీటితోపాటు జిల్లాలో 224 సబ్ సెంటర్లను నెలకొల్పింది. వాటిల్లో 161 కేంద్రాలను వెల్నెస్ సెంటర్లుగా మార్చింది. వాటిని పల్లె, బస్తీ వాసులకు తీర్చిదిద్ది అద్భుతమైన సర్కారు వైద్యాన్ని అందిస్తోంది. వీటన్నింటినీ జిల్లా కేంద్ర ప్రధాన వైద్యశాలకు అనుసంధానం చేసింది. ప్రస్తుతం జిల్లాలో 126 సెంటర్లకు సొంత బిల్డింగులు ఉండగా.. కొత్తగా 33 భవనాలను నిర్మిస్తోంది. దీంతోపాటు ప్రతీ సబ్సెంటర్కు ఒక వైద్యుడిని నియమించాలని సంకల్పించింది. ఇటీవలే ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. ఎంబీబీఎస్, ఆయుర్వేదిక్, బీఏఎంఎస్ అర్హత కలిగిన 85 మంది వైద్యులను ఒకేసారి విధుల్లోకి తీసుకున్నది. మరో 44 సెంటర్లలో ఖాళీలు భర్తీ కాని నేపథ్యంలో స్టాఫ్‌నర్సులను నియమించి పేదలకు నిరంతర వైద్యసేవలు అందిస్తోంది.
మారుమూల గ్రామాలకు ప్రభుత్వ వైద్యం
జిల్లాలో ఏర్పాటు చేసిన పల్లె, బస్తీ దవాఖానల ద్వారా మారుమూల గ్రామాల ప్రజలకూ అద్భుత వైద్యసేవలు అందుతున్నాయి. శిక్షణ పొందిన వైద్యులతోపాటు స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, ఆశాలు నిత్యం ప్రజ ల్లో ఉంటూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నారు. తద్వారా నయాపైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యాన్ని పొందుతున్నారు. దీర్ఘకాలిక రోగాల బారిన పడకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. సాధారణ జబ్బులకు తక్షణ సేవలు అందిస్తున్నాం.
-డాక్టర్ బి.మాలతి, డీఎంహెచ్‌వో, ఖమ్మం