కారేపల్లి, ఏప్రిల్ 13 : సీతారామ ప్రాజెక్టు ద్వారా సింగరేణి మండలానికి నీళ్లు ఇప్పించాలని కోరుతూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సింగరేణి మండల ప్రజావాణిలో సోమవారం తాసీల్దార్ ఓరుగంటి వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందించారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏండ్లలో సింగరేణి మండలానికి ఏ ప్రాజెక్టు ద్వారా చుక్కనీరు అందలేదని, వర్షాదారం, చెరువులు, బోర్లపైనే ఆధారపడి వ్యవసాయం నడుస్తుందన్నారు. అతివష్టి, అనావృష్టి పరిస్ధితిలో సింగరేణి మండల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వినతిలో తెలిపారు. సింగరేణి మండలలోని రేలకాయలపల్లి, బాజుమల్లాయిగూడెం, చీమలపాడు, పాటిమీదిగుంపు మీదిగా సీతారామ ప్రాజెక్టు నీటిని కాలువ ద్వారా తరలించే పనులు జరుగుతున్నాయన్నారు. కాలువల కోసం మండల రైతుల భూములు కోల్పోతున్నా చుక్కనీరు మండలానికి అందే అవకాశం లేదన్నారు.
ప్రాజెక్టు డిజైన్ మార్చి సింగరేణి మండలానికి నీరు అందించాలని కోరారు. కాలువలకు భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం అమలు చేయలేదన్నారు. ఇచ్చిన పరిహారంలో అవకతవకలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయన్నారు. వీటిని విచారించి న్యాయం చేయాలని మెరుగైన పరిహారం నిర్వాసితులకు అందాలని వినతిలో డిమాండ్ చేశారు. వినతిపత్రం అందించినవారిలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు కొండెబోయిన నాగేశ్వరరావు మండల కార్యదర్శి కే.నరేంద్ర, నాయకులు వజ్జా రామారావు, తలారి దేవప్రకాశ్, ఆదెర్ల వినయ్, నల్లబెల్లి ప్రతాప్ పాల్గొన్నారు.