Actor Nagarjuna | టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సైబర్ నేరాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘సురక్ష కా తిరంగా’ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిటల్ మోసాలు ఎంత ప్రమాదకరంగా మారుతున్నాయో తెలియజేస్తూ తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన భయానక అనుభవాన్ని అందరితో పంచుకున్నారు.
ఈ సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ.. కొద్ది సంవత్సరాల క్రితం ఓ సైబర్ కేటుగాడు బ్యాంకు అధికారిలా ఫోన్ చేసి తనను నమ్మించే ప్రయత్నం చేశాడని తెలిపారు. విదేశాలకు అక్రమంగా డ్రగ్స్ పార్సిల్ పంపారంటూ తన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని, ఏకంగా 6 నుంచి 7 గంటల పాటు తనను ‘డిజిటల్ అరెస్ట్’ రూపంలో మానసిక వేదనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. ఇక ఫోన్ హ్యాక్ అవుతుందనే భయం తనలో ఎప్పుడూ ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. ఈ కారణంగానే తాను ఎంతో జాగ్రత్తగా ఉంటానని, ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తన మొబైల్ పాస్వర్డ్ను మార్చేస్తానని చెప్పారు. అంతేకాకుండా భద్రతా కారణాల రీత్యా తన ఫోన్లో ఎలాంటి వ్యక్తిగత ఫొటోలను కూడా సేవ్ చేసుకోనని వెల్లడించారు.
మరోవైపు సైబర్ నేరాల కట్టడిలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నారని నాగార్జున ప్రశంసించారు. విదేశాలకు సైతం వెళ్లి నేరస్థులను పట్టుకొస్తున్న పోలీసుల పనితీరు అద్భుతమని కొనియాడారు. అలాగే టాలీవుడ్లో పైరసీ భూతాన్ని తరిమికొట్టడంలో ఐపీఎస్ అధికారులు సీవీ ఆనంద్, వీసీ సజ్జనార్ అందించిన సేవలను ప్రత్యేకంగా అభినందించారు. 1977లో తాను ఇంజనీరింగ్ అభ్యసించే నాటి నుంచే కంప్యూటర్లపై అవగాహన ఉందని, అప్పట్లోనే ప్రొఫెసర్లు మాల్వేర్, హ్యాకింగ్ ప్రమాదాల గురించి హెచ్చరించేవారని గుర్తుచేసుకున్నారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులతో కలిసి సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేయించి అందరిలోనూ అవగాహన కల్పించారు.