భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 22 (నమస్తే తెలంగాణ) : జిల్లా, బ్లాకుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. సోమవారం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా, బ్లాకుల అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికల రూపకల్పన, గణతంత్ర దినోత్సవం, దిశా కమిటీ సమావేశం తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్షించారు. 15వ ఆర్థిక సంఘం నిధుల మంజూరుకు స్థానిక సంస్థలు కార్యాచరణ తయారుచేయాలని, 29 అంశాలపై జిల్లా బ్లాకు నివేదికలు తయారుచేయాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, గతంలో చేపట్టిన పనులు కాకుండా నూతన పనులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ నెలాఖరు వరకు నివేదికలు అందజేయాలన్నారు. గ్రామ పంచాయతీ ప్రణాళికల పర్యవేక్షణకు డీపీవో రమాకాంత్, మండలస్థాయిలో జడ్పీ సీఈవోను నోడల్ అధికారులుగా నియమించినట్లు చెప్పారు. అనంతరం గణతంత్ర దినోత్సవ వేడుకలపై సమీక్షించారు. ఈ నెల 24వ తేదీ వరకు అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 10గంటలకు దిశా కమిటీ సమావేశం ఉంటుందని, అన్నిశాఖల అధికారులు పూర్తి నివేదికలతో హాజరుకావాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌రాజు, డీఆర్వో రవీంద్రనాథ్, ఏఎస్పీ విజయబాబు, జడ్పీ డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి పాల్గొన్నారు.
కొత్తగూడెం టౌన్, జనవరి 22 : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అన్నిశాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న ప్రజావాణికి జిల్లా నుంచి 144 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ మధుసూదన్‌రాజు, డీఆర్వో రవీంద్రనాథ్ పాల్గొన్నారు.