ఖమ్మం : ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలో ఫోటో గ్రఫీ పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ శుక్రవారం తెలిపారు. ఆసక్తి ఉన్న ఫోటో గ్రాఫర్లు పోటీలో పాల్గొనాలని కోరారు. 28వ తేదీన పాఠశాల, కళాశాల విద్యార్ధులకు జాతి నిర్మాణంలో పోలీసుల పాత్ర అనే అంశంపై అన్లైన్లో తెలుగు, ఇంగ్లీష్, ఉర్ధు భాషలలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తామన్నారు. వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వ్యాసాన్ని రాష్ట్ర పోలీస్ అధికారిక ఫేస్బుక్లో పబ్లిష్ చేయడం జరుగుతుందన్నారు.
పోలీసులకు సంబంధించిన షార్ట్ ఫీలిం పోటీలు నిర్వహించడం జరుగుతుందని, మూడు నిమిషాల నిడివితో పోలీసుల సేవలు, త్యాగాలు ప్రతిబింబించేలా తాజాగా రూపొందించిన చిత్రాలు, షార్ట్ ఫీలింస్ పంపించాలని సూచించారు. షార్ట్ ఫీలింస్, ఫొటోలు తెలంగాణ రాష్ట్ర పోలీస్ వెబ్సైట్, ఖమ్మం జిల్లా పోలీస్ వెబ్సైట్లలో సీడీ రూపంలో ఈ నెల 30వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు. ఎంపికైన షార్ట్ ఫీలింలను, రాష్ట్ర స్ధాయి పోటీలకు పంపిస్తామని గెలుపొందిన విజేతలకు బహుమతులు అందిస్తామని తెలిపారు.
27వ తేదిన పోలీసు, హోం గార్డు అధికారులకు, సిబ్బందికి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషలలో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరుగుతుందని సామాజిక మాద్యమాలను పోలీసులు ఎలా వినియోగించుకోవాలనే అంశంపై మొదటి క్యాటగిరి, చిన్నారులు, మహిళల హక్కుల రక్షణ, సమాజంలో వెనుకబడి వారి హక్కుల రక్షణలో పోలీసుల పాత్ర అనే వంశం రెండవ క్యాటగిరి కింద వ్యాసరచన పోటీలు ఉంటాయని సీపీ వివరించారు.