ఖమ్మం రూరల్, ఏప్రిల్ 27 : ఖమ్మం రూరల్ మండలం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ నెల 24వ తేదీ రాత్రి నుండి బంకుల్లో నిల్వలు తగ్గుకుంటూ వచ్చాయి. 25వ తేదీ ఉదయం 10:00 వరకు అన్ని బంకుల్లో పెట్రోలు, డీజిల్ నిండుకోవడంతో ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు ఎక్కలేని పరిస్థితి నెలకొంది. ఖమ్మం రూరల్ మండల పరిధిలోని ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ ప్రధాన రహదారుల వెంట భారీ లారీలు ఇతర వాహనాలు డీజిల్ కొరత కారణంగా నిలిచిపోయాయి. అన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. రెండు రోజుల నుండి ఇదే పరిస్థితి ఉండడంతో సోమవారం అత్యవసర వాహనాలుకు సైతం తిప్పలు తప్పలేదు.
108 వాహనాల సిబ్బంది బైపాస్ రోడ్ లోని అనేక బంకుల్లో డీజిల్ కోసం వెతికినా ఫలితం లేకుండా పోయింది. అత్యవసర వాహనాలకు రిజర్వు కోట నిల్వ ఉంచాలని తెలిసినప్పటికీ పెట్రోల్ బంక్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా అంబులెన్స్లకు సైతం డీజిల్ అందుబాటులో లేకుండా పోయిందని వారు వాపోయారు. ఏది ఏమైనా రెండు రోజుల నుండి ఇందన కొరత కారణంగా పౌర సమాజం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అయితే పెట్రోల్ బంక్ యజమానులు సంబంధిత అధికారులు మాత్రం తిరిగి యధాస్థితికి తీసుకోచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు.